మరోసారి తన పెద్ద మనసును చాటుకుంటూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నిజమైన హీరోగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటం ఆయనకు కొత్త విషయం కాదు. తాజాగా అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా అకస్మాత్తుగా కొన్ని విమాన సర్వీసులు నిలిచిపోవడంతో దుబాయ్లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఎక్కడికి వెళ్లాలో, ఎలా ముందుకు సాగాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్న వారికి సోనూ సూద్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
విమానాలు రద్దు కావడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ప్రయాణికులకు ఉచితంగా వసతి కల్పిస్తానని ఆయన ప్రకటించారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా తనను సంప్రదించాలని ఆయన సూచించారు. తన ఇన్స్టాగ్రామ్కు మెసేజ్ పంపితే వెంటనే తన బృందం స్పందించి అవసరమైన సహాయం అందిస్తుందని సోనూ సూద్ భరోసా ఇచ్చారు. ఈ సహాయం అందించడానికి ఎలాంటి షరతులు లేవని, ఏ దేశానికి చెందిన వారైనా సరే కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడటం మన బాధ్యత అని ఆయన చెప్పారు.
“ఇలాంటి సంక్షోభ సమయాల్లో మనుషులుగా ఒకరికొకరం అండగా ఉండటం చాలా అవసరం” అని సోనూ సూద్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన ప్రకటనతో ధైర్యం పొందిన పలువురు ప్రయాణికులు సహాయం కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
సోనూ సూద్ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు ఎంతో మంది జీవితాలను మార్చాయి. నగరాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులను వారి సొంత ఊర్లకు పంపేందుకు ప్రత్యేక బస్సులు, రైళ్లు, అవసరమైతే విమానాలు కూడా ఏర్పాటు చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, భారతీయులను స్వదేశానికి రప్పించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
అప్పటి నుంచి ప్రజలు ఆయనను ప్రేమగా ‘రియల్ హీరో’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మరోసారి విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి ముందుకు రావడంతో సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షోభ సమయంలో మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా సోనూ సూద్ నిలుస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి ఆయన అందిస్తున్న భరోసా ఎంతో మందికి స్ఫూర్తిగా మారుతోంది.
మంచి మనసు చాటుకున్న సోను సూద్