ఎస్.ఎస్. రాజమౌళి – మహేశ్ బాబు కాంబో అంటే సినిమా ప్రపంచం మొత్తం గుండె దడ పెంచే కాంబినేషన్. ఎన్నో నెలలుగా ప్రపంచం నలుమూలలలో షూటింగ్ జరుగుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ లేకుండా మిస్టరీగా ఉంచారు.
కానీ ఇక ఆ సస్పెన్స్ కి ముగింపు రాబోతోంది. నవంబర్ 15, 2025న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో దేశ చరిత్రలోనే ఓ లెజెండరీ రివీల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ ఈవెంట్లో సినిమా ఒరిజినల్ టైటిల్‌తో పాటు మొదటి వీడియో గ్లింప్స్ విడుదల అవుతుంది. ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే… ఈ గ్రాండ్ ఈవెంట్ మొత్తం జియోహాట్‌స్టార్ ద్వారా ప్రపంచానికి లైవ్‌గా ప్రసారం కానుంది అని సమాచారం.

ఇక ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే వరణాసి గాథలు చెబుతున్నట్టుగా ఉన్న ఓ సెట్టు నిర్మించారు… ఖర్చు? చెప్పాలంటే అబ్బో… దాదాపు 50 కోట్ల బడ్జెట్! జనాల్లో షూటింగ్ కష్టం కాబట్టి ఇలా పూర్తిగా రీక్రియేట్ చేశారట. టైటిల్ గా ‘వారణాసి’ అనేది బలంగా వినిపిస్తున్నా, అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాలేదు.

మహేశ్ బాబుతో పాటు ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో మార్చ్ 25, 2027న రిలీజ్ అయ్యే ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ కి నవంబర్ ఈవెంట్ ఓ చరిత్రాత్మక ఆరంభం కానుంది. “ఈ సినిమా భారతీయ సినిమాకే కాదు… ప్రపంచ సినిమా రేంజ్ మార్చే ప్రయత్నం” అనిపించే రీతిలో, ఫ్యాన్స్ ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నారు!