తలపతి విజయ్ నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేషన్ రాలేదని తెలుస్తోంది.
ఈ పరిణామంతో ‘జన నాయగన్’ నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని వారు భావిస్తున్నారని సమాచారం.
ఈ సినిమా ఇప్పటికే సామాన్య ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు కారణమవుతోంది. ముఖ్యంగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమాగా జన నాయగన్ ఉండటం వల్ల దీనిపై ఆసక్తి మరింత పెరిగింది.
జన నాయగన్ ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు విజయ్ రాజకీయ ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, కథానాయకుడు రాజకీయ నాయకులను కొరడాతో కొట్టే సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశాలే సెన్సార్ ప్రక్రియలో అడ్డంకులుగా మారాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ చివరి నిమిషపు సమస్యలు విజయ్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. తమ అభిమాన హీరోపై రాజకీయ ప్రతీకార చర్యలు జరుగుతున్నాయని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
విమర్శలున్నా, వివాదాలున్నా, ప్రస్తుతం జన నాయగన్ సినిమా మాత్రం హెడ్‌లైన్స్‌ను పూర్తిగా ఆక్రమించుకుంది. విజయ్ సినీ ప్రయాణానికి ముగింపు పలికే ఈ చిత్రం బిగ్ హిట్‌గా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.