తెలుగు సినిమాకు హుందాతనం నేర్పిన హీరో – శోభన్ బాబు

Tollywood Legend Shoban Babu: The Evergreen Icon of Grace and Dignity in Telugu Cinema

తెలుగు సినిమా చరిత్రలో కొన్ని పేర్లు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన నటుల్లో శోభన్ బాబు గారు ఒకరు. జనవరి 14న జన్మించిన ఆయన, తెరపై హడావిడి లేకుండా, హుందాతనంతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. హీరో అంటే కేవలం శక్తి ప్రదర్శన మాత్రమే కాదని, భావోద్వేగాలను నిశ్శబ్దంగా పలికించడమే నిజమైన నటన అని నిరూపించిన వ్యక్తి శోభన్ బాబు.

కాకినాడలో జన్మించిన ఉప్పు శోభనాచలపతి రావు చిన్ననాటి నుంచే కళలపై మక్కువ పెంచుకున్నారు. భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాల్లో సాధించిన శిక్షణ ఆయన నటనకు ప్రత్యేకమైన సౌందర్యాన్ని అందించింది. తెరపై ఆయన నడక, చూపు, మాట తీరు అన్నీ ఒక ప్రత్యేక శైలిగా మారాయి. చిన్న పాత్రలతో సినీ ప్రయాణం ప్రారంభించినా, క్రమంగా కథానాయకుడిగా ఎదిగి తనదైన ముద్ర వేశారు.

1970, 80 దశకాల్లో వచ్చిన కుటుంబ కథా చిత్రాలు శోభన్ బాబు గారిని ప్రతీ ఇంటి హీరోగా నిలబెట్టాయి. ప్రేమ, బాధ్యత, విలువలు కలగలిసిన పాత్రల్లో ఆయన కనిపించిన తీరు, సహజమూన నటన ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్టార్‌డమ్ ఉన్నా ఆర్భాటాలకు దూరంగా, వ్యక్తిగత జీవితంలో సాదాసీదాగా ఉండటం ఆయన ప్రత్యేకత. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే…శోభన్ బాబు కేవలం నటుడు మాత్రమే కాదు, తెలుగు సినిమాకు హుందాతనాన్ని నేర్పిన ఒక జీవన ప్రమాణం. ఆయన సినిమాలే…ఆయనకు ఇచ్చే శాశ్వతమైన జన్మదిన వేడుక. ఇంతకన్నా ఒక నటుడికి ఇంకేం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *