బంగాళాదుంప అంటే చాలా మందికి ఇష్టమైన కూరగాయ. అయితే బరువు పెరుగుతామనే భయంతో, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు ఎక్కువగా ఆలూను ఆహార జాబితా నుంచి తొలగించేస్తుంటారు. “ఆలూ అంటే కేవలం పిండి పదార్థం… తింటే ఊబకాయం తప్పదు” అనే అపోహ చాలా కాలంగా ఉంది. కానీ తాజా వైద్య పరిశోధనలు, పోషకాహార నిపుణుల అభిప్రాయాలు ఈ భావన పూర్తిగా సరైంది కాదని స్పష్టంగా చెబుతున్నాయి.
హెల్త్‌లైన్ వంటి విశ్వసనీయ ఆరోగ్య వేదికల ప్రకారం, బంగాళాదుంపలు సరైన పద్ధతిలో, పరిమిత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారమే. ఆలూలో కేవలం కేలరీలు మాత్రమే ఉండవన్న అభిప్రాయం తప్పు. వీటిలో సహజ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో పాటు విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం వంటి కీలక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
అయితే సమస్య ఆలూ కాదు… దాన్ని వండే విధానమే. ఆలూను డీప్ ఫ్రై చేసి ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, కట్లెట్స్ లాంటి పదార్థాలుగా తీసుకుంటే కేలరీలు, కొవ్వు గణనీయంగా పెరుగుతాయి. ఫలితంగా బరువు పెరగడమే కాదు, గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అదే ఆలూను ఉడికించి, కాల్చి, బేక్ చేసి లేదా గ్రిల్ చేసి తింటే కేలరీలు నియంత్రణలో ఉంటాయి.
మధుమేహం ఉన్నవారు ఆలూను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆలూలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా, ఉడికించి చల్లార్చినప్పుడు అందులోని పిండి పదార్థం ‘రిసిస్టెంట్ స్టార్చ్’గా మారుతుంది. ఇది ఫైబర్‌లా పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా సహాయపడుతుంది. కాబట్టి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలతో పాటు ఆలూను పరిమితంగా తీసుకుంటే బరువు, షుగర్ రెండింటినీ నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.