పాకిస్తాన్లోని రావల్పిండి సమీప ప్రాంతంలో జరిగిన తాజా పురావస్తు తవ్వకాలు చరిత్ర ప్రియులను ఆకర్షిస్తున్నాయి. తక్షశిలకు సమీపంలోని భీర్ దిబ్బ వద్ద కుషానుల కాలానికి చెందిన అరుదైన నాణేలు, అలాగే విలువైన లాపిస్ లాజులి రాయి శకలాలు వెలుగులోకి వచ్చాయి. ఇవి దాదాపు రెండువేల సంవత్సరాల నాటి అవశేషాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
తవ్వకాలలో లభించిన కాంస్య నాణేలు కుషాన సామ్రాజ్యంలోని చివరి గొప్ప పాలకుడిగా పేరుగాంచిన చక్రవర్తి వాసుదేవుడి కాలానికి చెందినవిగా నిర్ధారించారు. నాణేలపై ఒక వైపు వాసుదేవుడి రూపం, మరో వైపు మహిళా దేవత బొమ్మ ఉండటం విశేషం. ఇది కుషానుల కాలంలో మతపరమైన సహనానికి, బహుళ విశ్వాసాల స్వీకరణకు నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో కూడా కుషాన నాణేలపై భారతీయ, గ్రీకు, ఇరానియన్, బౌద్ధ సంప్రదాయాల ప్రభావాలు కనిపించాయి.
ఇక లాపిస్ లాజులి రాళ్లు ఈ ప్రాంతం ఎంతో పురాతన వాణిజ్య కేంద్రంగా ఉన్నదని సూచిస్తున్నాయి. మధ్య ఆసియా నుంచి దక్షిణ ఆసియా వరకు విస్తరించిన వాణిజ్య మార్గాల్లో టాక్సిలా కీలక పాత్ర పోషించిందని నిపుణుల అభిప్రాయం. మౌర్యుల కాలంలో పాటలీపుత్రంతో కలిపిన రాజమార్గం ద్వారా వ్యాపారం, సంస్కృతి, ఆలోచనల మార్పిడి జరిగినట్లు ఆధారాలు చెబుతున్నాయి.
కనిష్క మహారాజు వంటి శక్తివంతమైన పాలకుల హయాంలో టాక్సిలా రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది. బౌద్ధమతం, గాంధార కళ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ ప్రాంతం నిలయంగా మారిందని తాజా ఆవిష్కరణలు మరోసారి స్పష్టంచేస్తున్నాయి.