పెరుగుతున్న ఉద్రిక్తతః ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్దమౌతుందా?

Rising Tensions Is the United States Preparing for an Attack on Iran

ఇరాన్‌లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతుండటంతో… అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నిరసనలను అణచివేయడానికి భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకోవడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరెందరో గాయపడ్డారు.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలకు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్… ఇరాన్ ప్రజలు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అవసరమైతే నిరసనకారులకు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ ప్రభుత్వానికి ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను హింసిస్తే లేదా చంపితే అమెరికా జోక్యం చేసుకుంటుందని, వారికి బాధ కలిగించే చోట తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. అయితే ఇది సైన్యం పంపడమేనని అర్థం కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రభుత్వంలో ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించిన ఎంపికలపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం… ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడం కూడా ఒక ఎంపికగా అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తలతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.

మరోవైపు, ఇరాన్ ప్రభుత్వం నిరసనలపై మరింత కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. నిరసనల్లో పాల్గొనే వారిని ‘దేవుని శత్రువులు’గా పరిగణిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవహెది ఆజాద్ హెచ్చరించారు. ఈ నేరానికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని ప్రకటించడం కలకలం రేపుతోంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు ఫోన్ లైన్లను కూడా పరిమితం చేసింది. దీంతో దేశంలో వాస్తవ పరిస్థితులపై బయట ప్రపంచానికి స్పష్టత లేకుండా పోతోంది.

అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థల అంచనాల ప్రకారం… ఈ నిరసనల్లో ఇప్పటివరకు కనీసం 72 మంది మరణించగా, 2,300 మందికి పైగా అరెస్టయ్యారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం భద్రతా బలగాలకు కూడా నష్టం జరిగిందని చెబుతూ పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని ప్రచారం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసి… ఇరాన్–అమెరికా మధ్య పరిస్థితి ఎటు దారితీస్తుందన్నది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *