అమెరికా చర్యలపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా భయాందోళన వాతావరణం నెలకొంది. రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని మాస్కో ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఘటనతో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ అతి విశ్వాసంతో వ్యవహరిస్తోందని రష్యా నేతలు మండిపడుతున్నారు. రష్యా ప్రభుత్వానికి చెందిన కీలక నేత అలెక్సీ జురావ్లెవ్ ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. అమెరికా ఇలాగే వ్యవహరిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలపై టార్పిడోలతో దాడులు చేయాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించడం అంతర్జాతీయంగా సంచలనం రేపింది.
ఈ ఉద్రిక్తతకు కారణమైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. రష్యాకు చెందిన భారీ చమురు ట్యాంకర్ ‘మరినెరా’తో పాటు ‘సోఫియా’ అనే మరో నౌకను అమెరికా కోస్ట్ గార్డ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఐస్‌ల్యాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ఉత్తర అట్లాంటిక్ సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న ‘మరినెరా’ ట్యాంకర్‌పై అమెరికా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ల ద్వారా దిగిపోయి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక వెనెజువెలా నుంచి బయలుదేరి రష్యా వైపు వెళ్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ నౌక ఖాళీగా ఉన్నప్పటికీ, ఆంక్షలను ఉల్లంఘించే అవకాశం ఉందని పేర్కొంటూ సీజ్ చేశారు.
ఇక ‘సోఫియా’ ట్యాంకర్ కరీబియన్ సముద్ర ప్రాంతంలో వెనెజువెలా వైపు ప్రయాణిస్తుండగా, దీనిపై కూడా అమెరికా నిఘా పెట్టింది. వెనెజువెలాపై ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ అక్కడి నుంచి చమురు అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే, హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న కంపెనీకి ఈ కార్గో చేరుతుందన్న అనుమానాలతో రష్యాకు చెందిన ‘బెల్లా-1’ నౌకపై కూడా అమెరికా నిషేధం విధించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా–రష్యా మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు ఇది మరో మంటను జోడించినట్టుగా అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.