ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రభుత్వానికి చెప్పలేని పరిస్థితుల్లో, వాటిని ముందే గుర్తించి పరిష్కార దిశగా అడుగులు వేసే నాయకులకే నిజమైన ప్రజాదరణ లభిస్తుందని అంటారు. ఈ కోవలోనే దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూన్ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారారు. తమ దేశ యువత బట్టతల సమస్యతో తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని, దానికి సరైన చికిత్స పొందడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన గమనించారు. అందుకే బట్టతల చికిత్సను కేవలం వ్యక్తిగత కాస్మెటిక్ సమస్యగా కాకుండా, ఒక జాతీయ విధానపరమైన అంశంగా మార్చే ప్రయత్నం ప్రారంభించారు.
దక్షిణ కొరియా వంటి అత్యంత పోటీతో కూడిన సమాజంలో రూపానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువ. జుట్టు కోల్పోవడం వల్ల యువతలో ఆత్మవిశ్వాసం దెబ్బతినడమే కాకుండా, ఉద్యోగ అవకాశాలు, సామాజిక గుర్తింపు కూడా ప్రభావితమవుతున్నాయని అధ్యక్షుడు లీ జే-మ్యూన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వారసత్వంగా వచ్చే బట్టతలకు చేసే చికిత్సలను కూడా జాతీయ ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ కేవలం వ్యాధుల కారణంగా జుట్టు రాలితేనే బీమా వర్తిస్తుండగా, వంశపారంపర్య బట్టతలకు అయ్యే ఖర్చు పూర్తిగా వ్యక్తుల భాద్యతగానే ఉంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గత ఏడాది దాదాపు 2.40 లక్షల మంది జుట్టు రాలే సమస్యతో ఆసుపత్రులను ఆశ్రయించగా, వారిలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువత శాతం 40కి పైగా ఉండటం గమనార్హం. ఈ సంఖ్యలు యువతలో పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఆరోగ్య బీమా నిధులు లోటులోకి వెళ్లే ప్రమాదం ఉన్న వేళ, జుట్టు చికిత్సలపై ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం సరికాదని వైద్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమేనని, బట్టతల వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తక్కువగా అంచనా వేయలేమని తన నిర్ణయాన్ని సమర్థిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే, బట్టతల చికిత్సకు ప్రభుత్వ మద్దతు ఇచ్చే అరుదైన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటిగా నిలవనుంది.