ట్రంప్‌ చేతికి నోబెల్‌ బహుమతి

Trump Receives Nobel Peace Prize Medal from Venezuelan Leader Maria Corina Machado at White House Meeting

అమెరికా రాజకీయ వర్గాల్లో తాజాగా చోటుచేసుకున్న ఒక పరిణామం అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. వెనెజువెలా విపక్ష నేత, 2025 నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మారియా కోరీనా మచాడో అమెరికాలోని వైట్‌ హౌస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ సమయంలో మచాడో తనకు లభించిన నోబెల్‌ శాంతి బహుమతి పతకాన్ని ట్రంప్‌కు అందజేశారని సమాచారం. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సోషల్‌ మీడియా వేదిక ద్వారా వెల్లడించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ పతకాన్ని తన వద్దే ఉంచుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని వైట్‌ హౌస్‌కు చెందిన ఓ అధికారి ధృవీకరించారని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. సమావేశం అనంతరం మచాడో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్‌తో చర్చలు సానుకూలంగా జరిగాయని, అమెరికా అధ్యక్షుడిపై తన మద్దతుదారులు నమ్మకం ఉంచవచ్చని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ట్రంప్ కూడా తన ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికపై స్పందించారు. మచాడోను కలవడం గౌరవంగా ఉందని, వెనెజువెలాలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడిన ధైర్యవంతమైన మహిళగా ఆమెను అభివర్ణించారు. తన చేసిన పనికి గుర్తింపుగా ఆమె నోబెల్‌ శాంతి బహుమతి పతకాన్ని ఇచ్చిందని, ఇది పరస్పర గౌరవానికి నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు.

వెనెజువెలాలో కొనసాగిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు మచాడోకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. ఇటీవల వెనెజువెలాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో అధ్యక్షుడు నికోలస్‌ మదురో పదవీచ్యుతుడవడం, అమెరికా అదుపులో ఉండటం తెలిసిందే. అయితే మదురో స్థానంలో మచాడోను నాయకురాలిగా నియమించడంపై ట్రంప్ గతంలో స్పష్టమైన తిరస్కరణ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మచాడో–ట్రంప్ భేటీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు నోబెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ మాత్రం శాంతి బహుమతిని చట్టపరంగా ఇతరులకు బదిలీ చేయడం, పంచుకోవడం వీలు కాదని స్పష్టం చేస్తోంది. ఈ ఘటన రాజకీయంగా, నైతికంగా ఇంకా ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *