ఒక దీవి కోసం 706 బిలియన్‌ డాలర్లు… ట్రంప్‌ ప్లాన్‌ వెనుక భయంకరమైన నిజం

Why Trump Is Obsessed With Greenland NATO Rules 706 Billion Deal and the Hidden Global Power Game

ప్రపంచ పటంలో చూస్తే గ్రీన్లాండ్ ఒక మంచుతో కప్పబడిన, జనాభా తక్కువ ఉన్న దీవి మాత్రమే. కానీ వైట్ హౌస్ లోపలి మ్యాప్‌లలో మాత్రం అది “భవిష్యత్ ప్రపంచ యుద్ధానికి తాళం చెవి”. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్‌ను కొనుగోలు చేయడానికి 706 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యాడు అన్న వార్త బయటకు వచ్చినప్పుడు ప్రపంచం నవ్వింది. కానీ నిజానికి… అది నవ్వుకునే విషయం కాదు. అది భయపడాల్సిన సంకేతం.

గ్రీన్లాండ్ అంటే ట్రంప్‌కు ఇంత మోజు ఎందుకు?

ఇది అందరి మదిలో మెదిలే ప్రశ్న. 50 రాష్ట్రాలున్న అమెరికాకు మంచుతో కప్పబడిన గ్రీన్‌ల్యాండ్‌తో పనేంటి. ఎందుకు గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నుపడింది. ఆ మంచుకింద ఏమున్నది అనే డౌట్స్‌ వస్తాయి. గ్రీన్‌ల్యాండ్‌ అంటే మంచు కాదు, చేపలు కాదు, అందం కాదు. అది భవిష్యత్తులో ఆధిపత్యం సంపాదించేందుకు ఒక బేస్‌. మంచు ఉన్నచోట దేనిపై ఆధిపత్యం… ట్రంప్‌ ఇప్పటి గురించి ఆలోచించలేదు. భవిష్యత్తు గురించే ఆలోచించాడు. గ్రీన్‌ల్యాండ్‌ ఆర్కిటిక్‌ గేట్‌వే లాంటిది. ఈ ప్రాంతంలో ఉండే మంచు క్రమంగా కరుగుతున్నది. గ్లోబల్‌ వార్మింగ్‌ ఎంత పెరిగితే మంచు అంత ఎక్కువ కరుగుతుంది. ఫలితం సరికొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటాయి.

ఇలా ఏర్పడిన కొత్త సముద్ర మార్గం గుండా ఆసియా నుంచి యూరప్‌కు, యూరప్‌ నుంచి ఆసియాకు షిప్పులు ప్రయాణం చేస్తాయి. ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే సుమారు 40 శాతం సమయం ఆదా అవుతుంది. 40 శాతం ఆదా కావడం అంటే మామూలు విషయం కాదు. బోలెడు డబ్బు మిగులుతుంది. సూయజ్‌ కాలువ నుంచి వెళ్లే సమయం కంటే ఇది సేఫ్‌. ఇక్కడ కొత్త సముద్రాలు ఏర్పడితే అది గ్రీన్‌ల్యాండ్‌ పరిధిలోకి వెళ్తుంది. అంటే ఇక్కడి రాకపోకల వ్యవహారాలు, బిజినెస్‌ లావాదేవీలు గ్రీన్‌ల్యాండ్‌ చేతిలో ఉంటాయి. రిమోట్‌ కంట్రోల్‌ ఆ దేశం చేతిల్లో ఉంటుంది. భవిష్యత్‌ గ్లోబల్‌ ట్రేడ్‌ను గ్రీన్‌లాండ్‌ కంట్రోల్‌ చేస్తుంది.

గ్రీన్‌ ల్యాండ్ కంట్రోల్‌ చేసుకుంటే ట్రంప్‌కు ఎందుకు మంట అనే డౌట్‌ రావొచ్చు. ఇక గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికాకు ఎటువంటి హక్కులు లేవా అంటే ఉన్నాయి. 1951 చేసుకున్న ఒప్పందం ప్రకారం… గ్రీన్‌ల్యాండ్‌లో ఎయిర్‌బేస్‌, మిలటరీ బేస్‌ ఏర్పాటు చేసుకోవడానికి అమెరికాకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్‌లో యూఎస్‌ మిలటరీ బేస్‌ ఉంది.

దీవిని కొనుగోలు చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు

గ్రీన్‌ల్యాండ్‌లో ఫితుఫిక్‌ స్పెస్‌ బేస్‌ ఉంది. ఇది అమెరికా కంట్రోల్‌లోనే ఉంది. ఇక్కడ మిస్సైల్‌ వార్నింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది. రష్యా చైనాకు చెందిన ఉపగ్రహాలపై నిఘా ఉంచేందుకు వాటికి హెచ్చరికలు జారీ చేసేందుకు ఈ బేస్‌ను వినియోగించుకుంటారు. ఇక్కడే న్యూక్లియర్‌ రాడార్‌ కేంద్రం కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా. మరెందుకు ట్రంప్‌ దీవి కావాలని అంటున్నాడు అంటే… గ్రీన్‌లాండ్‌లో ఉన్న బేస్‌ డెన్మార్క్‌ అనుమతితో మాత్రమే నడుస్తున్నది. డెన్మార్క్‌ నాటో దేశం. నాటో అంటే కలిసి అని అర్ధం. కానీ, ఇలా కలిసి అనే పదం ట్రంప్‌కు నచ్చదు. తన దేశ భద్రత కోసం మరొకరి అనుమతి ఎందుకు తీసుకోవాలి అన్నది ట్రంప్‌ ఆలోచన. అందుకే బేస్‌ కాదు…మొత్తం దీవి కావాలని అంటున్నాడు.

నాటో రూల్ ఉండగానే ట్రంప్ ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు?

నాటో దేశాల్లో అమెరికా కీలక పాత్ర పోషిస్తోంది. నాటో దేశాల్లో ఏ దేశానికి ఇబ్బంది వచ్చినా, ఏ దేశంపైనైనా మరొ దేశం ఎటాక్‌ చేసినా అది అందరిపై చేసిన విధంగానే భావించాలని ఆర్టికల్‌ 5 చెబుతోంది. ఇప్పటి వరకు అమెరికన్‌ అధ్యక్షులంతా ఇలానే భావించారు. ఈ విధంగానే పనిచేశారు. కానీ, ట్రంప్‌కు నాటో అంటే ఖర్చు, బాధ్యత, పరిమితులు. ఇది ఆయనకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇలాంటి విషయాల్లో ట్రంప్‌ ఎప్పుడూ ఓపెన్‌గానే చెబుతుంటాడు. నాటో దేశాల్లో ఎక్కువగా యూరప్‌ దేశాలే ఉన్నాయి. యూరప్‌ దేశాల భద్రత కోసం అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి. ఇది ఆయన మాట. గ్రీన్‌ల్యాండ్‌ విషయంలోనూ ఇవే అడ్డంకులు. ఎందుకంటే గ్రీన్‌ల్యాండ్‌ స్వతంత్య్ర దేశమైనా… డెన్మార్క్‌ పరిపాలనలో భాగంగా ఉంది. అంటే గ్రీన్‌ల్యాండ్‌ కూడా నాటో దేశమే. ఈ దీవిని సొంతం చేసుకోవాలంటే ఈ నాటో రూల్స్‌ అడ్డొస్తున్నాయి. అందుకే కొనుగోలు చేయడానికి సిద్దమయ్యాడు. నాటోను బలహీనపరచడం మొదతి ఎత్తు. ద్వైపాక్షిక ఒప్పందాలు రెండో ఎత్తు. చివరిగా డబ్బుతో సమస్యకు పరిష్కారం చూపడం. ట్రంప్‌ ఎక్కడైనా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతాడు. ఎందుకంటే స్వతహాగా ట్రంప్‌ వ్యాపారవేత్త. డబ్బుతోనే అన్ని పనులు పూర్తి చేయాలనే స్వభావం కలిగినవాడు.

ఇదంతా సరే… ఒక చిన్న దీవిని కొనుగోలు చేయడానికి 706 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. ఇక్కడే అసలు రహస్యం ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్నది మంచు మాత్రమే కాదు. ఆ మంచుకింద భూమిపై దొరికే అత్యంత అరుదైన ఖనిజాలు ఉన్నాయి. లిథియం ఉంది, నియోడైమియమ్‌ ఉంది. కోబాల్ట్‌ కూడా మంచు కింద ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ట్రంప్‌ రిస్క్‌ తీసుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ ఖనిజాలను ఏఐ, ఈవీ బ్యాటరీలు, మిలటరీ టెక్నాలజీ, స్పేస్‌ ప్రోగ్రామ్‌ కోసం వినియోగించుకుంటారు. ఇలాంటి ఖనిజాలను ఎక్కువగా వినియోగించుకొని చైనా ఏఐ, టెక్నాలజీ, ఈవీ రంగంలో దూసుకుపోతున్నది. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నది. అయితే, చైనా అంటే ట్రంప్‌కు కోపం. చైనా దేశాన్ని శతృదేశంగా చూస్తారు. చైనాను కొట్టాలి అంటే రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కావాలి. గ్రీన్‌ల్యాండ్‌ ఒక్కటే ఆప్షన్‌. అందుకే అంత ఖర్చు పెట్టేందుకు వెనకాడటం లేదు. గ్రీన్‌ల్యాండ్‌ దీవిపై 706 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసి భవిష్యత్తులో 7 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ను కంట్రోల్‌ చేయాలన్నది ట్రంప్‌ ఆశ. అంతేకాదు, ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు…భవిష్యత్‌ యుద్ధ వ్యూహం కూడా.

యుద్ధవ్యూహం ఎలా

చైనా రష్యాలు ఈ గ్రీన్‌ల్యాండ్‌ ఆర్కిటిక్‌ సముద్రాల మార్గంలో యూరప్‌, అమెరికా దేశానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. యుద్ధాలు సంభవిస్తే ఈ మార్గంద్వారానే యుద్ధనౌకలు, మిస్సైల్స్‌ దూసుకొస్తాయి. కానీ, ఆ మిస్సైల్స్‌ అమెరికా వరకు రాకుండా ఆపాలంటే వాటిని గ్రీన్‌ల్యాండ్‌ సమీపంలోనే కూల్చివేయాలి. దీవిమొత్తం అమెరికా సొంతమైతే అక్కడ గోల్డెన్‌ డోమ్‌ ఏర్పాటు చేసి, మిస్సైల్స్‌ని అడ్డుకుంటారు. ఈ గోల్డెన్‌ డోమ్‌ కోసమే దీవి కావాలంటున్నాడు. గోల్డెన్‌ డోమ్‌ వెనుక అర్ధం ఇదే.

గ్రీన్లాండ్ ప్రజలు ఎందుకు ఒప్పుకోరు?

గ్రీన్‌ల్యాండ్‌ డెన్మార్క్‌ పాలనలో ఉన్నా… స్వయం పాలన కొనసాగుతోంది. పూర్తిగా స్వతంత్య్రం సాధించాలి అన్నది గ్రీన్‌ల్యాండ్‌ వాసుల కల. ఎప్పటి నుంచే పోరాటం చేస్తున్నారు. డెన్మార్క్‌ నుంచి పూర్తిగా వైదొలిగితే… చాలా కష్టాలు ఉంటాయి. అందుకే కలిసే ప్రయాణం చేస్తున్నది. అయితే, ఇప్పుడు అమెరికాలో కలిస్తే… పాలనా హక్కులు కోల్పోతారు. ఈ దీవిలో మిలటరీ నియంత్రణ ఎక్కువౌతుంది. కార్పోరేట్‌ మైనింగ్‌ జరుగుతుంది. ఫలితంగా ప్రశాంతంతో పాటు పర్యావరణం కూడా పాడైపోతుంది. స్థానికంగా ఉండే సంస్కృతి నాశనం అవుతుంది. దీనిని అక్కడి ప్రజలు అస్సలు ఒప్పుకోవడం లేదు. వు ఆర్‌ నాట్‌ ఫర్‌ సేల్‌ అని చెబుతున్నారు.

యూరప్ దేశాలపై సుంకాలు అంటే… యుద్ధమేనా?

ఈ మధ్యకాలంలో ట్రంప్‌ ఎక్కువగా వాడుతున్న మాట టారిఫ్‌. సుంకాలు విధిస్తాం అని బెదిరిస్తున్నాడు. అమెరికా దేశంపై ఆధారపడటం వలనే ట్రంప్‌ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గ్రీన్‌ల్యాండ్‌ను సొంతం చేసుకునే క్రమంలో అడ్డుపడిన దేశాలపై టారీఫ్‌లను విధిస్తామని అంటున్నాడు. అయితే, ఇప్పటికే నాటో కూటమిలో భాగంగా గ్రీన్‌ల్యాండ్‌కు కొన్ని యూరోపియన్‌ దేశాలు సైన్యాన్ని పంపించాయి. దీంతో ఆయా దేశాలపై ట్రంప్‌ టారీఫ్‌లను విధించాడు. ఇలా బెదరించడం, టారీఫ్‌లు విధంచడం కేవలం వాణిజ్యం మాత్రమే కాదు… యుద్ధం కూడా. ఇలా టారీఫ్‌లు విధిస్తే… యూరోపియన్‌ యూనియన్‌, యూఎస్‌ మధ్య ట్రేడ్‌ వార్‌ మొదలౌతుంది. నాటోలో చీలిక ఏర్పడుతుంది. నాటో చీలిపోయి, బలహీనపడితే దాని వలన రష్యా, చైనాలు మరింత లాభపడతాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న దేశాలను తమవైపు తిప్పుకుంటాయి. మంచు ప్రాంతంలో సైనిక పోటీ ఏర్పడుతుంది. యుద్ధం అనివార్యమైతే ఆర్కిటిక్‌ ప్రాంతం గుల్లవుతుంది. అమెరికా రష్యా మధ్య ఉన్నట్టుగా ఇది కోల్డ్‌ వార్‌ కాదు… ఫ్రోజెన్‌ వార్‌ అవుతుంది.

ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?

ఇంత జరిగిన తరువాత యుద్ధం రాకుండా ఆపడం ఎవరితరం కాదు. ఒకవేళ యుద్ధం జరిగితే మిగిలేది వినాశనమే. ఎవరో ఒకరు తగ్గాలి. ఎవరో ఒకరు సమిథ కావాలి. బలమైన దేశం కావసింది అడగదు లాక్కుంటుంది. అవసరమైతే డబ్బుతో కొనుగోలు చేస్తుంది. ఈ డబ్బు కీరోల్‌ పోషిస్తే భవిష్యత్తులో దీనిని ఆసరాగా తీసుకొని మరికొన్ని బలమైన దేశాలు డబ్బుతో బెదిరించి దీవులను, దేశాలను కలిపేసుకుంటాయి. ఇది ప్రపంచానికి ఏమాత్రం మంచిది కాదు. ట్రంప్‌ గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయాలి అనుకుంటున్నది మంచుకోసమో, ఆహ్లాదం కోసమో కాదు… భవిష్యత్‌ను కంట్రోల్ చేయడం కోసం. భవిష్యత్తును కంట్రోల్‌ చేసే అవకాశం, అధికారం ఆ భగవంతుడు ఎవరికీ ఇవ్వడు. దురాశ దుఃఖానికి చేటు. ఈ మాట గుర్తుంచుకుంటే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *