తన హెల్త్‌ సీక్రెట్‌ను రివీల్‌ చేసిన ప్రధాని మోదీ…

Daily Two Kilos of Criticism Is My Health Secret PM Modi’s Sharp Attack on Congress in Rajya Sabha

రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ప్రధాని, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన ఆరోగ్య రహస్యంపై చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

“నా ఆరోగ్యానికి కారణం విపక్షాల దూషణలే. రోజూ రెండు కిలోల తిట్లు తింటాను” అంటూ మోదీ చేసిన వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2002 నుంచి కాంగ్రెస్ తనపై వ్యక్తిగత దూషణలు చేస్తూనే ఉందని, వాటిని తట్టుకునే శక్తే తనకు బలమైందన్నారు. గతంలో జరిగిన పాలనా లోపాలను సరిదిద్దడంలోనే తమ ప్రభుత్వానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని తెలిపారు.

యూపీఏ హయాంలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా దిగజారిందని, ఆ అపప్రతిష్ఠను తొలగించేందుకు తమ ప్రభుత్వం కష్టపడ్డిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాదంపై కఠిన చర్యలు, సరిహద్దుల్లో సాహసోపేత నిర్ణయాలు దేశ భద్రతకు మైలురాళ్లుగా నిలిచాయని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని, ఓ ఎంపీని దేశద్రోహిగా ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ముఖ్యంగా సిక్కు సమాజాన్ని అవమానించేలా మాట్లాడటం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉన్న ద్వేషానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇలాంటి అహంకార ధోరణే కాంగ్రెస్ పతనానికి కారణమవుతుందని స్పష్టం చేశారు.

అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజలే రిమోట్ కంట్రోల్‌గా పనిచేస్తోందన్నారు. స్టార్టప్ విప్లవం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారత, రైతులకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలతో దేశం కొత్త దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యమే తమ మార్గదర్శకమని, ఎన్నికలు తాత్కాలికమని, దేశాభివృద్ధే శాశ్వతమని ప్రధాని స్పష్టమైన సందేశం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *