భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయికి సిద్ధమైంది. ఈ ఏడాది ఆరంభంలోనే తొలి ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటివరకు భారత రక్షణ వ్యవస్థకు మూడో కన్నులా పనిచేస్తున్న ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాలను అనేకాన్ని విజయవంతంగా కక్ష్యలోకి పంపిన ఇస్రో, తాజాగా పీఎస్ఎల్వి సి-62 ప్రయోగం ద్వారా మరో అత్యాధునిక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది.
శత్రుదేశాల కదలికలను నిశితంగా గమనించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ కొత్త భూ పరిశీలన ఉపగ్రహాల శ్రేణికి ఇస్రో శాస్త్రవేత్తలు “అన్వేషణ” అనే అర్థవంతమైన నామకరణం చేశారు. ఇకపై దేశ సరిహద్దుల భద్రత, భూ పరిశీలన, రక్షణ అవసరాల కోసం పనిచేసే అన్ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను ‘అన్వేష’ సిరీస్‌లో భాగంగా ప్రయోగించాలనే నిర్ణయానికి ఇస్రో వచ్చింది.
ఈ సిరీస్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేవలం రక్షణ పరమైన అవసరాలకే కాకుండా, వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో కూడా ఈ ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించనున్నాయి. తుఫానులు, వరదలు, భూకంపాల వంటి విపత్తులపై ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, ప్రాణ నష్టం తగ్గించడంలో ‘అన్వేషణ’ తోడ్పడనుంది.
ఈ నెల 12వ తేదీ సోమవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వి సి-62 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇప్పటికే కౌంట్‌డౌన్‌కు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. ఈ ప్రయోగంలో కక్ష్యలోకి వెళ్లే ప్రధాన ఉపగ్రహం ఈఓఎస్–ఎన్1 (అన్వేష) సుమారు 1,485 కిలోల బరువు కలిగి ఉండగా, 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో స్థాపించనున్నారు.
ఇదే ప్రయోగంలో భాగంగా సింగపూర్, లక్సెంబర్గ్, యూరప్, యునైటెడ్ స్టేట్స్, యూఏఈ వంటి దేశాలకు చెందిన సుమారు 200 కిలోల బరువు కలిగిన మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఇస్రో కక్ష్యలోకి పంపనుంది. స్వదేశీ అవసరాలతో పాటు వాణిజ్య పరంగా ఇతర దేశాలకు సేవలందించడం ద్వారా ఆదాయం సమకూర్చుకునే దిశగా ఇస్రో మరో అడుగు ముందుకు వేస్తోంది.
ఈ ప్రయోగం విజయవంతమైతే, రేపటి నుంచే అంతరిక్షంలో నుంచి పొరుగు దేశాల కదలికలను గమనించే ‘అన్వేషణ’ కార్యాచరణ అధికారికంగా ప్రారంభమైనట్లే. ఇది భారత భద్రతా వ్యవస్థకు మరింత బలం చేకూర్చనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.