గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్‌లో పాల్గొన్న శౌర్యయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని పౌరాణిక ప్రాధాన్యం గల సోమనాథ్ ఆలయాన్ని ఆదివారం సందర్శించిన ప్రధాని… ముందుగా ఆలయాన్ని రక్షిస్తూ ప్రాణత్యాగం చేసిన వీరులకు అంకితంగా నిర్వహించిన ‘శౌర్యయాత్ర’కు నాయకత్వం వహించారు. సోమనాథ్ స్వాభిమాన్ పర్వంలో భాగంగా ఈ యాత్రను నిర్వహించగా, శౌర్యం, త్యాగం, ధర్మ పరిరక్షణకు ప్రతీకగా దీన్ని భావించారు.
ఈ శౌర్యయాత్రలో 108 గుర్రాలతో కూడిన ఘనమైన ఊరేగింపు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఓపెన్‌టాప్ వాహనంపై నిల్చుని ప్రధాని మోదీ ముందుకు సాగుతుండగా, రహదారి ఇరువైపులా నిల్చున్న భక్తులు ఆయనకు ఉత్సాహంగా అభివాదం చేశారు. ప్రధాని కూడా చిరునవ్వుతో ప్రజలకు చేతులూపుతూ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన రెండు చేతులతో డమరుకం పట్టుకుని వాయించడంతో… ఆ శబ్దం గాలిలో మారుమోగింది. “మోదీ… మోదీ…” అంటూ జనసమూహం నినాదాలు చేయగా, పూలవర్షంతో ఊరేగింపు మరింత వైభవంగా మారింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి సుమారు ఒక కిలోమీటరు పొడవునా సాగిన ఈ యాత్రలో ప్రధాని ప్రజలతో మమేకమయ్యారు. అక్కడి భక్తులతో కలిసి సంప్రదాయ డ్రమ్ములను వాయించడం కూడా ప్రత్యేకంగా కనిపించింది.
చరిత్రలోకి వెళ్తే… 1026 సంవత్సరంలో మహ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై తొలిసారి దాడి చేశాడు. ఆ తరువాత శతాబ్దాల కాలంలో ఎన్నో విదేశీ దాడులు జరిగినా, ఆలయాన్ని, జ్యోతిర్లింగాన్ని కాపాడేందుకు వేలాది మంది యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా, ఆ వీరుల స్మృతికి గుర్తుగా ఈ శౌర్యయాత్రను నిర్వహించారు.
శౌర్యయాత్ర అనంతరం ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతిర్లింగాన్ని దర్శించి ప్రార్థనలు చేసిన ఆయన… ఋషులు, సాధువులు, భక్తులను అభివాదం చేశారు. అలాగే ఆలయంలో బాల గురువులు పఠించిన మంత్రాలను శ్రద్ధగా విన్నారు. మొత్తం కార్యక్రమం భక్తి, శౌర్యం, చరిత్ర స్మరణతో నిండిన ఆధ్యాత్మిక ఘట్టంగా నిలిచింది.