అయోధ్య శ్రీరామాలయం పరిసరాల్లో చోటుచేసుకున్న తాజా ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే రామాలయ కాంప్లెక్స్‌లో ఓ కశ్మీర్ యువకుడు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం ఆలయ సముదాయం లోపల నమాజ్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం ప్రకారం, దక్షిణ గోడల సమీపంలోని సీతారసోయి ప్రాంతం వద్ద ఆ యువకుడు ప్రార్థనకు సిద్ధమవుతుండగా సిబ్బంది గమనించారు. గేట్ డీ1 ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన అతడు కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించి ఉండటంతో అనుమానం మరింత బలపడింది. విచారణలో అతడిని కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్‌గా గుర్తించారు. భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఒక నిర్దిష్ట మతానికి మద్దతు కోరుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అతడిని భద్రతా అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. రామాలయం ట్రస్టు కూడా స్పందించకపోవడం గమనార్హం. మరోవైపు, రామాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో నియమాలను మరింత కఠినతరం చేస్తూ జిల్లా పాలన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయానికి 15 కిలోమీటర్ల పరిధిలో నాన్-వెజిటేరియన్ ఆహారం, మద్యం సరఫరా నిషేధమని స్పష్టం చేసింది. హోటళ్లు, లాడ్జీలు, ఆన్‌లైన్ డెలివరీ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామాలయం భద్రత మరింత కట్టుదిట్టంగా మారనుంది.