కాళ్లు పనిచేయకున్నా 75 ఏళ్ల వయసులో అలుపెరుగని పోరాటం

75-Year-Old Rajappan’s Silent Mission Cleaning Vembanad Lake with Unbreakable Spirit

సౌకర్యం, విశ్రాంతి కోరుకునే వయస్సులో… బాధ్యతను భుజాన వేసుకున్న వ్యక్తి ఎన్.ఎస్. రాజప్పన్. 75 ఏళ్ల వయసులోనూ ఆయన జీవితం ఒక నిశ్శబ్ద పోరాటం. కేరళలోని వెంబనాడ్ సరస్సు పరిశుభ్రతే తన లక్ష్యంగా చేసుకుని, దాదాపు పదేళ్లుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు.

ఐదేళ్ల వయసులో పోలియో బారిన పడిన రాజప్పన్‌కు మోకాళ్ల కింద భాగం పూర్తిగా పనిచేయదు. అప్పటి నుంచి ఆయన నడవలేకపోయినా, ఆత్మవిశ్వాసం మాత్రం ఎప్పుడూ కదలకుండా నిలిచిపోయింది. ప్రతిరోజూ ఒక చిన్న పడవను అద్దెకు తీసుకుని, ఒక్క పడవడితోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు సరస్సులో తిరుగుతూ ప్లాస్టిక్ చెత్తను సేకరిస్తారు. సరస్సులో తేలుతూ కనిపించే వ్యర్థాలను ఏరి వేయడమే ఆయనకు రోజు మొదలు, రోజు ముగింపు.

ప్రతి కిలో ప్లాస్టిక్‌కు రూ.12 మాత్రమే అందుతుందని ఆయన చెబుతారు. ఆ మొత్తం పెద్దగా జీవనసౌఖ్యాన్ని ఇవ్వకపోయినా, తన జీవనాన్ని సాగించడానికి, తన పని కొనసాగించడానికి చాలు అన్నది ఆయన విశ్వాసం. సంపాదనకన్నా సేవకే ఆయన ఎక్కువ విలువ ఇస్తారు.

రాజప్పన్ తన సోదరి ఇంటి పక్కనే ఉన్న చిన్న ఇంట్లో నివసిస్తారు. ఆమె వండిపెట్టే భోజనంపై తప్పా… ఆయన ఎవరిపైనా ఆధారపడరు. రోజువారీ పనులన్నింటినీ స్వయంగా నిర్వహిస్తూ, తన గౌరవాన్ని తన శ్రమతోనే నిలబెట్టుకుంటున్నారు.

2018 వరదల్లో ఆయన ఇల్లు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ సమయంలోనూ సహాయం అడగకుండా, కొన్ని వారాలపాటు తన పడవలోనే నివసించారు. బాధను మాటల్లో చెప్పకుండా, ధైర్యంగా మౌనంగా భరించారు.

వెంబనాడ్ సరస్సును తన బాధ్యతగా భావిస్తూ, మౌనంగా చేసే ఈ సేవే నిజమైన దేశప్రేమకు ఉదాహరణగా నిలుస్తోంది. జెండాలు ఎగరేయడం, నినాదాలు చేయడం మాత్రమే దేశభక్తి కాదు… తన చేతలతో దేశాన్ని శుభ్రంగా ఉంచడమే అసలైన ప్రేమ అని రాజప్పన్ జీవితం చెప్పకనే చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *