ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. బెంగళూరు–కడప–విజయవాడ ఆర్థిక కారిడార్ (NH-544G)పై జాతీయ రహదారుల సంస్థ NHAI, ఎం/ఎస్ రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో 24 గంటల వ్యవధిలో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. ఒకే రోజులో నిరంతరంగా 28.95 లేన్ కిలోమీటర్లు రహదారి నిర్మాణం, 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వేయడం ద్వారా ఈ అరుదైన ఘనతను అందుకుంది. ఈ పనులు అన్నీ NHAI నిర్దేశించిన కఠిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టడం విశేషం. ఈ విజయంతో భారతదేశంలో ప్రపంచ స్థాయి రహదారి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం మరోసారి స్పష్టమైంది.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా సాగుతున్న హైవే అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా ఇలాంటి రికార్డు విజయాలు సాధ్యమవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజినీర్లు, కార్మికులు, ఫీల్డ్ సిబ్బంది నిరంతర శ్రమ, అంకితభావం ఈ ఘనతకు కారణమయ్యాయి. ఇక ఇదే కారిడార్‌లోని ప్యాకేజీలు 2, 3పై 2026 జనవరి 11 నాటికి మరో రెండు గిన్నిస్ రికార్డులు సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విజయంతో “భారతదేశం నిర్మిస్తుంది – ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది” అనే నినాదం నిజమవుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.