సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు మరింత బలం చేకూర్చడంతో పాటు, కొత్త పథకాల రూపకల్పనలోనూ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఊరట కలిగించేలా ‘గరుడ’ అనే కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఈ పథకం ప్రధానంగా పేద బ్రాహ్మణ కుటుంబాల్లో అనుకోని మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రూపొందించబడింది. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మృతి చెందితే, బాధిత కుటుంబానికి రూ.10 వేల నగదు సాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. కష్టకాలంలో కనీస భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
గరుడ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. అమరావతిలో జరిగిన సమావేశంలో మంత్రి సవిత, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ ఈ పథకం అమలు తీరుపై విస్తృతంగా చర్చించారు. త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఆ పథకాలను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు.