నాలుగు రోజుల దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. రేపు ఉదయం 8.25 గంటలకు ఆయన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ కీలక పర్యటనలో ముఖ్యమంత్రి సుమారు 36 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించారు. లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా మొత్తం 16 మంది ప్రముఖ పారిశ్రామిక నాయకులతో చర్చలు జరిపారు.
ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగావకాశాల సృష్టిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాష్ట్రంతో భాగస్వామ్యం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరారు. దావోస్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలబెట్టే దిశగా సీఎం చంద్రబాబు మరో కీలక అడుగు వేశారని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.