ఇది కేరళ కాదు… ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. సంక్రాంతి పండుగ వేళ ఇక్కడి వాతావరణం పండుగ ఉత్సాహంతో కళకళలాడింది. పచ్చని పొలాలు, కాలువల వెంట కొబ్బరి చెట్లు, గ్రామీణ జీవనశైలి కలిసి ఆత్రేయపురాన్ని ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రముగా మార్చాయి. ఈ అందాలను చూసిన చాలామందికి కేరళను తలపించే దృశ్యాలు కనువిందు చేశాయి.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో నిర్వహించే పడవ పందేలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పడవ పందేలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కాలువల్లో వేగంగా దూసుకెళ్లే పడవలు, వాటిని నడిపే యువకుల ఉత్సాహం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ పడవ పందాలకు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి గుర్తింపు ఉండటం విశేషం.
ఈ సంప్రదాయ క్రీడపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించారు. ఆత్రేయపురం పడవ పందేలను ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ, గ్రామీణ సంస్కృతి గొప్పతనాన్ని ప్రశంసించారు. పండుగ ఆనందం, పల్లె సంప్రదాయాలు, ప్రజల ఉత్సాహం కలిసి ఆత్రేయపురాన్ని ఈ సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయి.