ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన యూనివర్శిటి ఏది అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆక్సఫర్డ్ అని. ఇది ఇంగ్లాండ్ దేశంలో ఉంది. ఆక్స్‌ఫర్డ్‌తో పాటు కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్, మాంచెస్టర్ యూనివర్శిటి ఇలా ప్రసిద్ధిపొందిన పలు యూనివర్శిటీలు ఉన్నాయి. స్వతంత్య్రానికి పూర్వం విదేశీ చదువులు అంటే ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేసేది ఇంగ్లాండ్ యూనివర్శిటీలనే. ఇప్పుడంటే అమెరికా యూనివర్శిటీల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.
అయితే, అమెరికా- భారత్ మధ్య సంబంధాలు క్షీణించడం, ట్రంప్ టారీఫ్‌ల పేరుతో పదేపదే భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని చూడటం, విద్యార్థులకు వీసాలు ఆలస్యం చేయడం, హెచ్1 బి వీసా విషయంలో లక్ష డాలర్లు పే చేయాలి అనడంతో అమెరికాకు వెళ్లాలి అనుకుంటున్నవారు సొంత దేశంలోనే ఉండి ఇక్కడే చదువు ఉద్యోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. భారత్‌లో మెరుగైన యూనివర్శిటీలు ఉన్నా… ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్శిటీల్లో విద్యను అభ్యసించడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7న యూకే ప్రధాని కియర్ స్టార్మర్ భారత్‌కు వచ్చారు.
భారత్‌తో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. 243 మంది భారీ డెలిగేట్స్‌తో ఆయన ఇండియా రావడం విశేషం. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో వాణిజ్య ఒప్పందాలతో పాటు విద్యకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా యూకే యూనివర్శిటీలు భారత్‌కు తరలివచ్చే విషయంపై కూడా చర్చించారు.
ఈ చర్చల అనంతరం బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఓ సంచలన ప్రకటన చేశారు. యూకేకు చెందిన అన్ని యూనివర్శిటీలు భారత్‌లో తమ శాఖలను ఏర్పాటు చేస్తాయని తెలిపారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. యూకే వెళ్లి చదవాలని అనుకునేవారు ఇకపై అక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఇండియాలో ఏర్పాటు చేయబోయే ఆయా యూనివర్శిటీల శాఖల్లో చదువుకుంటే సరిపోతుంది. చదువు పూర్తయ్యాక నేరుగా ఆయా యూనివర్శిటీల నుంచి పట్టా పుచ్చుకోవచ్చు.
ఇక్కడ బ్రాంచ్‌లు ఏర్పాటు చేయడం వలన విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, స్టేయింగ్ ఖర్చులు తగ్గుతాయి. ఈ ఖర్చుతో ఇండియాలోనే యూనివర్శిటీ బ్రాంచ్‌లో చదువుకోవచ్చు. అంతేకాదు, యూకే, ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇండియాలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు యూకే ముందుకు వస్తుంది. ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగావకాశాలు ఉంటాయి కాబట్టి దేశం దాటి వెళ్లవలసిన అవసరం ఉండదు. యూకే ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాకు కొంత ఇబ్బందికరమైనదనే చెప్పాలి. యూకే నాటో దేశం కావడంతో ఆ దేశంపై ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అమెరికా ఒత్తిడికి యూకే తలొగ్గి తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక భవిష్యత్‌ను అర్థంచేసుకొని ఇండియాతో చెలిమి చేస్తుందా చూడాలి.