భారత్ రష్యా మధ్య సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి. అత్యవసర సమయంలో రష్యా భారత్‌కు సహకారం అందిస్తూ వస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో బలమైన బంధం ఏర్పరుచుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు సంస్కృతి బంధానికి పునాదులు వేశాయి. భారత్ నుంచి తొలిసారిగా గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు రష్యాకు చేరుకున్నాయి. ఇది ప్రపంచ బౌద్ధ సమాజానికి ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుంచి ప్రత్యేకమైన భద్రత మధ్య ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఈ పవిత్ర అవశేషాలను రష్యాలోని కల్మైకియాకు తరలించారు.
పవిత్ర అవశేషాల చరిత్ర
ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో భద్రపరిచిన బుద్ధుని అవశేషాలు 2500 సంవత్సరాలనాటివని చెబుతారు. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం పొందిన తరువాత ఆయ శరీర అవశేషాలను వివిధ దేశాలు, బౌద్ధకేంద్రాలకు పంపిణీ చేశారు. కాగా, భారత్‌లోని కుశీనగర్, శ్రావస్తి ప్రాంతంలో కొన్ని అవశేషాలు ఇంకా భద్రంగా ఉన్నాయి. కాగా, ఇందులో కొన్నింటిని ఢిల్లీ నేషనల్ మ్యూజియంలో భద్రపరచగా, కొన్నింటిని ఇప్పుడు రష్యాకు తరలించారు.
ఇండియా నుంచి రష్యాకు
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రష్యా ప్రభుత్వాలు సమన్వయంతో సంయుక్తంగా ఈ యాత్రను చేపట్టాయి. బంగారు పేటికలో అవశేషాలను భద్రపరిచి వాటని ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానంలో న్యూఢిల్లీ నుంచి కల్మైకియా రాజధాని ఎలిస్టా నగరానికి తరలించారు. రష్యాకు చేరుకున్న ఈ విమానానికి రష్యన్ బౌద్ధ సన్యాసులు, స్థానిక ప్రజలు, సాంస్కృతిక ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.
ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
కల్మైకియాలో బౌద్ధ సంప్రదాయం
రష్యారాజధాని మాస్కోకు కాకుండా కల్మైకియా రాష్ట్ర రాజధాని ఎలిస్టా నగరానికి ఈ పవిత్ర అవశేషాలను ఎందుకు తరలించారనే అనుమానాలు రావొచ్చు. రష్యాలో బౌద్ధమతాన్ని ఆచరించే వారు కల్మైకియా రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో బౌద్ధులు నివశిస్తున్నారు.
కల్మైకియా రష్యాలో ఏకైక బౌద్ధ ప్రదేశ్‌గా ప్రసిద్ధి. అక్కడ బౌద్ధమతాన్ని అనుసరించే లక్షలాది భక్తులు నివసిస్తున్నారు. బుద్ధుని అవశేషాలు అక్కడకు రావడం ఆ భక్తులకు ఆధ్యాత్మిక పర్వదినంలా మారింది. ఎలిస్టా నగరంలోని గోల్డెన్ టెంపుల్ ఆఫ్ శాక్యముని బుద్ధలో ఈ అవశేషాలను ప్రజా దర్శనార్థం ఉంచారు.
ప్రపంచ బౌద్ధ సమాజానికి ప్రాధాన్యం
ఇది భారతదేశం, రష్యా మధ్య ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను మరింత బలపరుస్తుంది. భారతదేశం బుద్ధుని జన్మభూమి కాగా, రష్యా బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవంగా భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా శాంతి, కరుణ, మానవతా విలువల సందేశాన్ని ప్రపంచానికి పంపడం ప్రధాన లక్ష్యం.
భక్తుల ఆనందం
అవశేషాలను చూసిన భక్తులు తాము బుద్ధుని ప్రత్యక్ష దర్శనం పొందినట్టుగా భావిస్తున్నారు. పూలతో, దీపాలతో, ధూపదీపనాదాలతో వారు ఘనంగా పూజలు చేశారు. “ఇది మన జీవితంలో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షణం” అని స్థానిక భక్తులు చెబుతున్నారు. భారత్ నుంచి కల్మైకియాకు బుద్ధుని అవశేషాల యాత్ర కేవలం పుణ్యయాత్ర మాత్రమే కాదు… ఇది శాంతి, సత్యం, సమానత్వం అనే బుద్ధ తత్వాలకు పునర్జన్మ అనే చెప్పాలి.