ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు.
✅ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం గడిచిన 27 నెలల కాలంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓసీ రూపంలో అందించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన గణాంకాలను శాసనసభ ముందు వివరించారు.
✅శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని అనేక అంశాలను తెలిపారు. “రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే (#SEEEPCSurvey) లెక్కల ప్రకారం తెలంగాణలోని 1.15 కోటి కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నాం. పేదలకు జీవిత బీమాను అందించి వారిలో ధీమా కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతోంది.
✅తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశాం. గడిచిన 27 నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (#CMRF) కింద రూ. 2046 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 2,400 కోట్లు మొత్తంగా రూ. 4,500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశాం.
✅#Telangana రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 6వ డిసెంబర్ 2023 వరకు #RajivAarogyasri కింద ప్రతి నెలా సగటున రూ. 52 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత 7 డిసెంబర్ 2023 నుంచి 25 మార్చి 2026 కాలంలో ప్రజా ప్రభుత్వం సగటున ప్రతి నెలా రూ. 89 కోట్లు ఖర్చు పెట్టింది.
✅గత ప్రభుత్వం బకాయిల భారాన్ని మాపై పెట్టింది. ఆ భారాన్ని మోస్తూనే.. రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచాం. 7 డిసెంబర్, 2023 నాటికి గత ప్రభుత్వం నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీలో వారసత్వంగా వచ్చిన భారం రూ. 600.27 కోట్లు. అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 240.11 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 360.16 కోట్ల బకాయి ఉంది.
✅ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఈరోజు వరకు రూ. 2,408.51 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులను చెల్లించాం. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 927.99 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 1,480.52 కోట్లు చెల్లించాం. నెలకు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 34 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 54 కోట్లు అందించాం.
✅రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మొత్తం రూ. 725.75 కోట్లు బకాయి ఉంటే, అందులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన మొత్తం రూ. 600 కోట్లు. గత ప్రభుత్వ బకాయి పోగా గడిచిన 28 నెలల కాలంలో ఈ ప్రభుత్వ బకాయి కేవలం రూ. 100 కోట్లు మాత్రమే. ఇందులోనూ ప్రభుత్వ ఆసుపత్రులకే ఎక్కువగా రూ. 496.31 కోట్లు బకాయి ఉంటే, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 231.44 కోట్లు ఉంది.
✅రాష్ట్రంలో నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం పేదల్లో ధీమా కల్పించాలన్న సంకల్పంతోనే 1.15 కోట్ల కుటుంబాలకు జీవిత బీమా తెస్తున్నాం.
✅రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇవ్వకపోవడం వల్ల చికిత్స అందడం లేదన్న వాదన వాస్తవం కాదు. సీఎంఆర్ఎఫ్ గతంలో ఎలా దుర్వినియోగమైందో అందరికీ తెలిసిందే. అందుకని మరింత పారదర్శకంగా ప్రజాప్రతినిధులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి వీలు కల్పించాం.
✅నిమ్స్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు 3 వేల కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి కలిపి రాష్ట్రంలో కొత్తగా 10 వేల పడకల సామర్థ్యంతో అత్యాధునికంగా వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నాం. పనులు వేగంగా జరుగుతున్నాయి.
✅రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలు వైద్యం కోసం టీచింగ్ హాస్పిటల్స్‌కు పంపిస్తే తద్వారా అక్కడున్న నిపుణులైన వైద్యులతో చికిత్స అందించడానికి అలాగే వైద్య విద్యార్థులకు వృత్తిరీత్యా ఎంతో అనుభవం వస్తుంది. చికిత్స అందించే అనుభవం కలిగిన వైద్యులకు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం.
✅పేదలకు మరింత వేగవంతమైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆసుపత్రుల నిర్వహణ విధానంలో కూడా మార్పులు చేస్తున్నాం. వైద్యులకే హాస్పిటల్ నిర్వహణ బాధ్యత అప్పగించడం వల్ల వైద్యంపై దృష్టి సారించలేని పరిస్థితులు ఉంటున్నాయి. అందుకని నిర్వహణ విభాగాన్ని వేరు చేయాలన్న ఆలోచన చేస్తున్నాం.
✅విదేశాల్లో గొప్ప పేరు గడించిన వైద్యులు తల్లిదండ్రుల కోసమో, ఇతర పనుల కోసం రాష్ట్రానికి వచ్చినప్పుడు వెసులుబాటును బట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పేదలకు వారి సేవలను అందించడానికి వీలుగా మెడికల్ అండ్ హెల్త్ వెబ్‌సైట్ ద్వారా ఒక వేదికను క్రియేట్ చేస్తున్నాం.
✅సమాజంలో వైద్య రంగం ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రజలకు ఉపయోగపడే సూచనలను స్వీకరిస్తాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యం.
✅విద్య పరంగా నర్సరీ నుంచి 10 వరకు, వైద్యం పరంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి స్పెషాలిటీ హాస్పిటల్స్ వరకు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. మంచి రోల్ మాడల్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాం…” అని ముఖ్యమంత్రి గారు సమగ్రంగా వివరించారు.
విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత – పేదల వైద్యం కోసం రూ.4500 కోట్లు ఖర్చు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి