తీర ప్రాంత అడవుల రక్షణ… ఆక్రమణల నిరోధంపై దృష్టి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Coastal Forest Protection & Green Wall Projects Reviewed by Deputy CM Pawan Kalyan
  • గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్
  • నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనబడాలి
  • జనవరి నెలాఖరులోపు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలి
  • సచివాలయంలో అటవీశాఖతో సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

తీర ప్రాంత అడవుల రక్షణ.. ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనవరి నెలాఖరులోపు అందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకు అప్పగించాలని తెలిపారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపడం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు.

అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ శాఖలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. మంగళవారం వెలగపూడి, సచివాలయం 2వ బ్లాక్ లోని క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారత దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సుమారు 974 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడంతోపాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపేయాలి.

ఆ పరిధిలో మడ, సరుగుడు, తాటిచెట్లు లాంటి మొక్కలతో నింపేసి తుపానులు లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంతానికి, తీర ప్రాంతం వెంబడి ఉన్న ఆవాసాలకు రక్షణ కల్పించాలి. ఇప్పటికే మన కోస్తా తీరం వెంబడి 402 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి, వాటి సంరక్షణ చర్యలు చేపడుతోంది. మిగిలిన భూముల్లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూ విస్తీర్ణం ఎంత? అందులో అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది? ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతులో ఉన్న భూమి ఎంత? అన్న అంశాలపై అధ్యయనం జరిపాలి.

  • మూడు దశల్లో గ్రేట్ గ్రీన్ వాల్:
    గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మూడు దశల్లో ముందుకు తీసుకువెళ్లాలి. మొదటి దశలో కోస్తా ప్రాంతానికి ఆనుకుని ఉండే ప్రాంతం మొత్తం మొక్కలు పెంచాలి. మలి దశలో తీర ప్రాంతానికి ఆనుకుని ఉండే కాలువలు, రోడ్లు, డొంకల వెంబడి మొక్కలు నాటాలి. చివరి దశలో వ్యవసాయ భూముల్లో రైతులకు కూడా ఉపయోగపడే విధంగా మొక్కలు పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. మిస్టీ ( Mangrove Initiative for Shoreline Habitats & Tangible Incomes), కాంపా (Compensatory Afforestation Fund Management and Planning Authority), గ్రీన్ క్లైమెట్ ఫండ్ తో పాటు సీఎస్ఆర్ నిధులు, ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున చెట్లు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. స్థానిక సమాజాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తూ.. ఉన్న మొక్కలను రక్షించడం, తీర ప్రాంతం వెంబడి ఆక్రమణలను నిరోధించడంపై దృష్టి సారించాలి.
  • 50 శాతం గ్రీన్ కవర్ మనకు ప్రతిష్టాత్మక కార్యక్రమం:
    50 శాతం గ్రీన్ కవర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రత్యేకంగా అప్పగించిన కార్యక్రమం. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాతోపాటు అందరిపైనా ఉంది. గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే గ్రీన్ కవర్ కూడా పెంచినవారమవుతాము. జిల్లాల వారీగా ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖలన్నింటినీ భాగస్వామ్యం చేయాలి. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. అటవీశాఖతో పాటు ఉద్యానశాఖ, నీటిపారుదల, గిరిజన సంక్షేమ శాఖ, హెచ్.ఆర్.డి., పరిశ్రమలు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల సమన్వయంతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. వారం వారం లక్ష్యాలకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలి. గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ పనుల్లో కచ్చితమైన పురోగతి కనబడాలి.

  • నోటిఫై కాని మడ అడవుల గుర్తింపుకు కృషి:
    రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల విస్తీర్ణంలో నోటిఫై కాని మడ అడవులు ఉన్నట్టు శాటిలైట్ ద్వారా గుర్తించాం. ఆ పది వేల ఎకరాలు కూడా నోటిఫై చేసి అటవీ శాఖకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా అటవీశాఖ పరిధిలో లేని ఈ మడ విస్తీర్ణంలో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. మడ అడవుల రక్షణతోపాటు గ్రేట్ గ్రీన్ వాల్ ఆవశ్యకతపై తీర ప్రాంత ప్రజలు, నాయకులకు ప్రత్యేక అవగాహక కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రీన్ వాల్, గ్రీన్ కవర్ లో భాగస్వామ్యం కావాల్సిన ప్రతి శాఖ విడివిడిగా సమీక్షలు ఏర్పాటు చేయాలి. అన్ని శాఖల సమన్వయంతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లాలి. ఈ ప్రక్రియ మొత్తం జనవరి నెలాఖరు లోపు పూర్తి చేయాల”న్నారు.

ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖల ప్రధాన కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, అటవీశాఖ సలహాదారుడు శ్రీ మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ శ్రీమతి శాంతిప్రియ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

  • ప్రొద్దుటూరు నియోజక వర్గం గ్రామీణ రోడ్లకు రూ.10 కోట్లు:
    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రొద్దుటూరు శాసన సభ్యులు శ్రీ వరదరాజుల రెడ్డి గారు కలిశారు. మంగళవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా పంట పొలాల మధ్య రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలో పండ్ల తోటలు అధికంగా ఉన్న నేపథ్యంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తే మార్కెటింగ్ సదుపాయాలు మెరుగవుతాయని, ప్రొద్దుటూరు హార్టికల్చర్ హబ్ గా ఎదుగుతుందని వివరించారు. సాస్కీ పథకం కింద ఇప్పటికే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 10 కోట్లు కేటాయించినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *