పార్వతీపురంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధి ఆర్.కే.జూనియర్ కళాశాల విద్యార్దులకు, అధ్యాపకులకు మత్తుపదార్దాల వలన కలిగే అనర్దాలు, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ర్యాగింగు, మహిళా చట్టాలు గురించి జనవరి 24న సీఐ డా వెంకటరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మనీషా రెడ్డి మాట్లాడుతూ – విద్యార్ధులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి, హెరాయిన్, కొకైన్, డ్రగ్స్ వంటి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
మత్తు పదార్థాలకు ఒకసారి అలవాటుపడితే, వారు వాటికి త్వరగా బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన చాలామంది విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉండాలని, మంచి లక్ష్యంతో ఉన్నత చదువులను చదివి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా భవిష్యత్తుకు రూపకల్పన చేసుకోవాలన్నారు. సైబరు మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్స్ కు వచ్చే తెలియని యాప్లు, లింకులపై క్లిక్ చేయవద్దని, ఒటిపి లను ఎవ్వరికీ చెప్పవద్దని, రివార్డు పాయింట్ల పేరుతో వచ్చే మెసేజ్లను నమ్మవద్దని విద్యార్థులు, అధ్యాపకులకు సూచించారు.
అదేవిధంగా విద్యార్థులకు ర్యాగింగు వలన కలిగే దుష్పభావాలను వివరించి, అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థుల పట్ల శృతిమించి ప్రవర్తిస్తే, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాలన్నారు. ర్యాగింగుకు పాల్పడిన విద్యార్థులపై చట్టరీత్యా చర్యలు చేపట్టడంతోపాటు అర్ధంతరంగా వారి చదువు, కెరీర్ కూడా నాశనం అవుతుందన్న విషయాన్ని ప్రతీ విద్యార్ధి గమనించాలన్నారు.
ఎవరైనా సైబరు మోసాలకు గురైన వారు సకాలంలో https://cybercrime.gov.in/ లేదా 1930 ఫిర్యాదు చెయ్యాలని, అదేవిధంగా గంజాయి అమ్మినా, కలిగివున్న, తరలించినా నేరమేనని తెలిపారు. గంజాయి మరియు ఇతర అసాంఘిక కార్యక్రమాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే 1972కు, 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం టౌన్ సీఐ డా వెంకట రావు, ఎస్సై గోవింద్, కళాశాల అధ్యాపకులు,విద్యార్దులు పాల్గొన్నారు.