టీటీడీ గుడ్‌న్యూస్ః ఉద్యోగులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ

Free Helmets Distribution for Employees

తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. షెల్టర్లు, షెడ్డులు, ఉచిత మంచినీరు, ఉచిత భోజనంతో పాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, శ్రీవారి సేవలో తరించే ఉద్యోగుల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉద్యోగులకు ఉచిత ఇళ్ల స్థలాలను అందివ్వగా ఇప్పుడు వారి భద్రత కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకున్నది. శ్రీవారి ఆలయంలో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ద్విచక్రవాహనాలపై వచ్చే ఉద్యోగులకు హెల్మెట్లు అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్వర్యంలో 500 హెల్మెట్లను పంపిణీ చేశారు. అమలాపురం, హైదరాబాద్‌కు చెందిన భక్తులు రెండువేల హెల్మెట్లను విరాళంగా అందించారు. వీటిని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టుగా అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో మరో 7500 హెల్మెట్లను కూడా ఉద్యోగులకు అందించనున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు చెబుతున్నారు. హెల్మెట్లు భక్తి ఉట్టిపడేలా తయారు చేయించారు. కాషాయం రంగులో ఉండే ఈ హెల్మెట్లు ముందు భాగంలో శ్రీవారి తిరునామం ఉండటం విశేషం. టీటీడీ ఉద్యోగులు అని గుర్తుపట్టేందుకు ఈ హెల్మెట్లు చిహ్నంగా మారనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *