2026లోనూ ఇదే దూకుడు ఉండాలి… విద్యుత్‌ చార్జీలపై గుడ్‌న్యూస్‌

Good News on Power Tariffs CM Chandrababu Calls for Same Investment Momentum in 2026

సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 14వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం రాష్ట్రాభివృద్ధిపై కీలక దిశానిర్దేశం చేసింది. గత ఏడాది పెట్టుబడుల విషయంలో సాధించిన అద్భుత విజయాన్ని 2026లోనూ అదే ఉత్సాహంతో కొనసాగించాలని సీఎం సూచించారు. ఇప్పటికే 13 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో ఏపీ పెట్టుబడిదారులకి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ తిరిగి నిలబడిందని, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు.

ముఖ్యంగా విద్యుత్ రంగంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు గుడ్‌న్యూస్‌గా మారాయని సీఎం తెలిపారు. విద్యుత్ ఛార్జీలను 13 పైసలు తగ్గించామని, రూ.4500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కు తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తీసుకున్న సంస్కరణల వల్లే డేటా సెంటర్లు, పెద్ద పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు చెప్పారు. టీమ్ వర్క్‌తో సాధించిన ఈ విజయాలు పాలనలో స్పీడ్, ఫలితాలే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *