మహాకవి గురజాడ అప్పారావు భావాలు, రచనలు నిత్య నూతనమని ఏపీ రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. నవయుగ వైతాళికుడు ,సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు 163వ జయంతి ఉత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. విజయనగరంలోని కోటవద్ద ఉన్న గురజాడ స్వగృహంలోని చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్య జంక్షన్ సమీపంలోని గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహారాజా సంగీత.న్యత్య కళాశాల,కస్పా,మాన్సాస్,బీసెంట్,స్కూల్ విద్యార్దినీ,విద్యార్ధులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించి సత్య లాడ్జి జంక్షన్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తొలిసారి గురజాడ జయంతి సభ ఏర్పాటు
మహాకవి గురజాడ జయంతి సందర్భంగా తొలిసారి నగరంలోని సత్య లాడ్జి వద్ద ఏర్పాటు చేసి సభలో ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురజాడ నిత్య స్మరణీయులని పేర్కొన్నారు. అందరికీ అర్ధం అయ్యే వాడుక భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయని అన్నారు. వందేళ్ల క్రితమే ముందు చూపుతో మహాకవి ఎన్నో రచనలు చేశారని, ఆయన ఆశయాలు నేటికీ,ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకమన్నారు. దేశ ప్రధాని మోడీ సైతం గురజాడ రచనల నుంచి స్ఫూర్తి పొందారని, ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి గుర్తు చేశారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఆయన జీవిత చరిత్ర, దేశభక్తి గేయాలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. గురజాడ గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేసేందుకు ప్రతీ పాఠశాలలో ఆయన చిత్రపటాన్ని ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురజాడ స్వగృహం ప్రక్కనున్న స్థలాన్నిఅభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
గురజాడ ఇంటి అభివృద్దికి పది లక్షలు నిధులు కేటాయింపు
విజయనగరంలో గురజాడ అప్పారావు ఇంటికి అభివృద్దికి తన నియోజక వర్గం నుంచీ పదిలక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్టు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పష్టం చేసారు.అంతకుముందు జిల్లా కొత్త కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ, గురజాడ గొప్ప సంఘ సంస్కర్త అని తెలుగు భాష నిలిచి ఉన్నంతవరకు గురజాడ రచనలు నిలిచి ఉంటాయని అన్నారు. కన్యాశుల్కంలో సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పపంతులు లాంటి పాత్రలు ఇప్పుడు కూడా మన కళ్లముందే కదలాడుతున్నాయని చెప్పారు. గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా… దేశభక్తి గేయం మనందరికీ ఆదర్శమని, దేశం పట్ల పౌరుల బాధ్యతను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని విభిన్న సాహిత్యాలను అధ్యయనం చేసిన గురజాడ, తెలుగు జాతికి అపూర్వ రచనలను అందించారని కలెక్టర్ కొనియాడారు.
కార్యక్రమంలోఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఎన్ని తరాలు మారినా గురజాడ రచనలు సజీవంగా నిలిచే ఉంటాయని అన్నారు. ఆయన దేశభక్తి గేయం భావితరాలకు స్ఫూర్తి దాయకమన్నారు. గురజాడ భావాలు, ఆలోచనలు, ఆశయాలు భావితరాలకు అందించడానికి కృషి చేయాలని కోరారు. గురజాడ ఇంటి అభివృద్దికి ఎంపి ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు కలిశెట్టి ప్రకటించారు.తూర్పుకాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ, గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ గురజాడ గొప్పదనాన్ని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేధుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, ఆర్‌డిఓ డి.కీర్తి, డిఈఓ మాణిక్యం నాయుడు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డిఐపిఆర్ఓ గోవిందరాజులు, జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మండపాక నాగలక్ష్మి, గురజాడ కుటుంబ సభ్యులు వెంకటేశ్వరప్రసాద్, ఇందిర, లలిత, పలువురు సాహితీ సంఘాల ప్రతినిధులు, నాయకులు, అధికారులు సాహితీ ప్రియులు, విద్యార్ధులు పాల్గొన్నారు.