భారతదేశాభివృద్ధికి ట్రంప్ పరోక్షంగా సహకరిస్తున్నారా అంటే ప్రస్తుత విశ్లేషకులు అవుననే అంటున్నారు. ఒకరిపై ఆధారపడటం ఎప్పుడైతే నిలిపివేస్తామో అప్పటి నుంచే మన అభివృద్ధి ప్రారంభం అవుతుంది. కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. జీవితాన్ని సరికొత్తగా మార్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది. సరిగ్గా ఇలాంటి అంశాలనే మద్రాస్ ఐఐటి డైరెక్టర్ కూడా ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్1 బి వీసా ఫీజు పెంపుపై ఆయన స్పందించారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారత్‌కు ఒకరకంగా దీవెనగా భావించాలని అన్నారు.
ట్రంప్ నిర్ణయం మనపై రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది. అందులో మొదటిది అమెరికాలో ఉద్యోగాలు చేయాలనే ఆశతో ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థులు ఇప్పుడు వెళ్ళకుండా ఉండిపోవచ్చు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌గా నాకు ఇది ఆనందంగా ఉంది. ఎందుకంటే వారు ఇక్కడే ఉండి దేశానికి ఉపయోగపడతారు. రెండవది – మన దేశంలోనే పరిశోధన చేయడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులు అమెరికాకు వెళ్లకుండా, భారతదేశానికే సేవ చేయగలరు” అని తెలిపారు.
గత ఐదేళ్లలో ఐఐటీ మద్రాస్‌లో 95 శాతం విద్యార్థులు భారతదేశంలోనే కొనసాగారని ఆయన వివరించారు. కేవలం 5 శాతం మాత్రమే విదేశాలకు వెళ్లారని చెప్పారు. “అమెరికాకు వెళ్లే క్రేజ్ ఇక్కడ చాలా వరకు తగ్గిపోయింది. ఇది మన దేశానికి గొప్ప అవకాశం. మన పరిశోధనలు, ఆవిష్కరణలు ఇక్కడే జరిగి దేశ అభివృద్ధికి తోడ్పడతాయి. ఈ విషయంలో ట్రంప్ గారికి ధన్యవాదాలు చెప్పాలి” అని కామకోటి అన్నారు. మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ చెప్పిన విధంగా విద్యార్థులు విదేశీ మోజును తగ్గించుకొని ఇక్కడే పరిశోధనలు చేయడం, వారి పరిశోధనల సారాంశాన్ని ఇక్కడే అభివృద్ధి చేస్తే వారితో పాటు దేశం కూడా అభివృద్ధి పధంలో ముందుకు వెళ్తుంది. దేశం అభివృద్ధి సాధిస్తే మనం కూడా అభివృద్ధి చెందుతాం. మనకున్న వనరులు అటువంటివి మరీ. ఈ ఆర్టికల్‌పై మీ కామెంట్ ఏమిటో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.