బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో పాటు ఒడిశా తీరప్రాంతంలో తీరం దాటిన సమయంలో అటు ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారు జాము నుంచి రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
శుక్రవారం వరకు కనిపించిన సూర్యుడు శనివారం రోజున హటాత్తుగా మాయం కావడంతో పాటు మబ్బులు పట్టి వర్షాలు కురవడంతో ప్రజలు ఒకింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరులోని కొన్ని ప్రాంతాల్లో చాలా అరుదుగా మాత్రమే వర్షాలు కురుస్తుంటాయి. ఎక్కువభాగం పొడి వాతావరణం నెలకొంటుంది. అయితే, ఈ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షాలు కురవడంతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది.
అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.