తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవం నిర్వహించడంతో లక్షలాదిగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దేవదేవుడిని దర్శించుకుంటే చాలని గ్యాలరీల్లో కిక్కిరిసిపోయి నిలుచున్నారు. గరుడోత్సవాన్ని తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చినట్టుగా సమాచారం. అయితే, వీరిలో చాలా మంది ఆదివారం రోజున మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు ప్రయత్నించినట్టుగా గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఆదివారం రోజున స్వామివారిని 79,496 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 29,591 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఆదివారం రోజున ₹3.79 కోట్ల ఆదాయం హుండీద్వారా లభించినట్టు అధికారులు పేర్కొన్నారు. సోమవారం రోజున కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం విచ్చేసిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్‌హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడి ఉండటం విశేషం. సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 300 రూపాయల శీఘ్ర దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, సర్వదర్శనం కోసం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నది. బ్రహ్మోత్సవాలు, దసరా సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు.