కింగ్స్టన్ సముద్రతీర ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా అలలు పెరిగి ఇళ్లలోకి నీళ్లు ముంచెత్తాయి. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్లు కూలిపోవడంతో సంప్రదింపులు దాదాపు అసాధ్యమయ్యాయి. వరదలతో రోడ్లు కొట్టుకుపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు, వాహనాలు ఎగిరిపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అత్యవసర సేవలు అందించే పోలీస్, ఫైర్, రెస్క్యూ బృందాలు పడవలు, హెలికాఫ్టర్లు ద్వారా ప్రజలను తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
కింగ్స్టన్ పోర్ట్ ప్రాంతంలో సముద్ర అలలు 15 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలలు, ఆసుపత్రులు అత్యవసర స్థితికి మారాయి. స్థానిక ప్రభుత్వం ఇప్పటికే మూడు రోజుల ముందే హై అలర్ట్ ప్రకటించినప్పటికీ, తుఫాన్ తీవ్రత ఊహించని స్థాయికి చేరుకోవడంతో నష్టం భారీగా నమోదైంది.
ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో పైగా ఐక్యరాజ్య సమితి సాయం కోరినట్లు సమాచారం. వందలాది కుటుంబాలు షెల్టర్లకు తరలించబడ్డాయి. సమీప పర్వత ప్రాంతాల్లో ల్యాండ్‌స్లైడ్స్ ప్రమాదం ఉన్నందున మరింత అప్రమత్తతతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం మెలిస్సా తుఫాన్ కింగ్స్టన్ నుంచి ఉత్తర దిశగా క్యూబా వైపు కదులుతోందని వాతావరణ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తుఫాన్‌ను జమైకాలోని ప్రజలు గత 20 ఏళ్లలోనే అత్యంత ఘోర ప్రకృతి విపత్తులలో ఒకటిగా పేర్కొంటున్నారు.