అమెరికా…ఇండియా మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో భారత్ చూపులు యూరప్‌పై సారించింది. యూరప్‌లో తమకు అనుకూలంగా ఉన్న దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ సెప్టెంబర్ 10వ తేదీన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ఫోన్‌లో మాట్లాడారు. భారత్- ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, బలపరచడం తదితర అంశాలపై చర్చించారు. 2025-2029 మధ్య కాలానికి ఉద్దేశించిన సంయుక్త వ్యూహాత్మకల కార్యాచరణ ప్రణాళికను రూపకల్పన చేశారు. ఈ ప్రణాళికలో రక్షణ, వాణిజ్యం, భద్రత, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి అంశాలు ప్రధానంగా ఉన్నాయి.
రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరుచుకునే దిశగా చర్చిస్తూనే, ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని ఎలా ఆపాలి అనే అంశాన్ని ఆ రెండు దేశాలు కూర్చొని మాట్లాడుకోవాలని, నాయకులు అడుగు ముందుకు వేసి శాంతి చర్చలు జరపాలని అన్నారు. అలాగే భారత్–యూరోపియన్ యూనియన్ ఉచిత వాణిజ్య ఒప్పందానికి మద్దతు తెలపడంతో పాటు భారత్–మధ్యప్రాచ్యం–యూరప్ ఆర్థిక కారిడార్కు అండగా నిలిచారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ భేటి భారత్ దౌత్యరంగంలోని పటిమను ప్రపంచానికి మరోమారు తెలియజేసింది.