వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్ రూపుదిద్దుకొంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే విధంగా చేస్తుంది ఈ బడ్జెట్. స్వల్ప కాలిక లక్ష్యాల కంటే దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలే మన దేశ వృద్ధికి మేలు చేస్తున్నాయి. అందులో భాగంగా కాలం చెల్లిన నియమాలను పక్కనబెట్టి విదేశీ పెట్టుబడులకు మన దేశం తగిన కేంద్రం అనే సంకేతాన్ని ప్రపంచ దేశాలకు పంపించారు. అదే సమయంలో ఎం.ఎస్.ఎం.ఈ.లకు ఊతమిచ్చేలా ప్రత్యేక నిధులు కేటాయించడం హర్షణీయం. కచ్చితంగా ఈ చర్యలు యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తాయి.
క్యాన్సర్ ఔషధాలపైన, మధుమేహం లాంటి దీర్ఘకాల వ్యాధులకు వినియోగించే మందులపై పన్ను తగ్గింపు కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశం. డేటా సెంటర్ల ఏర్పాటు చేసే సంస్థలకు 2047 వరకు ప్రకటించిన టాక్స్ హాలిడే దేశాన్ని డేటా సెంటర్ల కేంద్రంగా మారుస్తుంది. ఈ నిర్ణయం కచ్చితంగా మన రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుంది. చేనేత రంగానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు రాష్ట్ర చేనేత పరిశ్రమకు బలాన్నిస్తుంది. కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాలు కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జీడి రైతులకు ఊరటనిస్తుంది. భారత భవిష్యత్ శక్తిని ఆవిష్కరించే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనింపచేస్తూ, శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం అభినందనలు తెలియచేస్తూ తీర్మానం ప్రవేశపెడుతుంది.