తెలంగాణ కోసం పోరాటం చేసిన రోజులు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే, ఇప్పుడు మరలా అటువంటి పోరాటానికి సిద్దమౌతున్నది బీఆర్ఎస్ పార్టీ. పదేళ్లు అధికారం తరువాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమిపాలై ప్రతిపక్షానికి ఫిక్స్ కావలసి వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టి వివిధ రకాలైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అయితే, ఎన్నికల హామీలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం రోజున ప్రత్యేకమైన నిరసనను చేపట్టారు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పార్టీ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చిందో తెలుసుకునేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఫ్రీబస్ తరువాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆటో డ్రైవర్లకు వాహన భీమా, ఇంధన సబ్సిడీ, ప్రత్యేక సంక్షేమ బోర్డు, పింఛన్, రుణమాఫి తదితర అంశాలను తెలుసుకునేందుకు ఆయన ఆటోలో ప్రయాణించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు… తగ్గిన రోజువారి ఆదాయంతో రుణభారం పెరిగిపోతోందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరో మూడేళ్లు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుంచే అలర్ట్ అవుతోందని, నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తే …ఐటీ, రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలు, విదేశీ సంస్థలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంపై తమకు పట్ట తగ్గలేదని నిరూపించడమే కాకుండా, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదు.