టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత డ్రోన్‌ల వినియోగం భారీగా పెరిగింది. అత్యవసర సర్వీసుల నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ డ్రోన్ హబ్‌గా మారి ప్రపంచపటంలో స్థిరమైన స్థానాన్ని సంపాదించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఓర్వకల్లును డ్రోన్‌హబ్‌గా తీర్చిదిద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలులో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అసలు డ్రోన్ హబ్ అంటే ఏంటి? అక్కడ ఎలా ఉంటుంది. తెలుసుకుందాం.
ఓర్వకల్లులో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉంది. ప్రస్తుతం దీనిని అత్యవసరం కోసమే వినియోగిస్తున్నారు. ప్లైజోన్ ఉండటం వలన ఇక్కడే 300 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం సేకరించి డ్రోన్ హబ్‌గా మార్చనున్నారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్‌లకు సంబంధించిన అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహిస్తారు. సాంకేతిక, పరిశోధన కేంద్రాలు కూడా ఈ హబ్‌లోనే ఉండనున్నాయి. తయారీతో పాటు మరమ్మత్తులు కూడా ఇక్కడే ఉంటాయి. ఈ హబ్‌లో ఎండ్ టు ఎండ్ అన్ని రకాలైన సేవలు లభిస్తాయి.కొత్తరకం డ్రోన్లు తయారీ నుంచి వాటి టెస్టింగ్ వరకు అంతా ఒకేచోట ఉంటుంది.
అంతేకాదు, డ్రోన్ తయారీకి అవసరమైన నిపుణులు, టెక్నికల్, ఇంజనీర్లు అందరికోసం ఇక్కడే ప్రత్యేకంగా శిక్షణ ఉంటుంది. ఈ డ్రోన్ హబ్ ఏర్పాటైతే ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తాయి. ఇప్పటికే గరుడ ఏరోస్పేస్ సంస్థ 100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉంది. 3వేల కోట్ల ప్రతిపాదనతో కూడిన ఈ డ్రోన్ హబ్ ద్వారా 40వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని, 25 వేల మందికి పైలట్‌లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం తెలుపుతోంది.