ఫిలిప్పీన్స్‌లోని మిండనావో దీవిని ఉదయం 9:43 గంటలకు భూకంపం బలంగా కుదిపేసింది. ఫిలిప్పీన్స్ వోల్కానాలజీ అండ్ సైస్మాలజీ సంస్థ (Phivolcs) తెలిపిన ప్రకారం, రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భారీ భూకంపం దావావో ఒరియెంటల్ ప్రాంతంలోని మనాయ్ పట్టణం సమీపంలో సంభవించింది. భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే దీని కేంద్రబిందువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
భూకంపం సంభవించిన వెంటనే దావావో నగరం సహా పలు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాలు, విద్యుత్ స్తంభాలు బలంగా ఊగిపోవడంతో కొన్ని చోట్ల చిన్నపాటి నష్టాలు జరిగినట్లు సమాచారం. తీరప్రాంతాల్లో సముద్ర జలాలు కదలిక చూపడంతో అధికారులు సునామీ హెచ్చరికను కూడా జారీ చేశారు. స్థానిక రేడియో స్టేషన్లు, అత్యవసర సేవా సంస్థలు ప్రజలను సముద్రతీరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించాయి.
ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి విపత్తు నిర్వహణ బృందాలను మోహరించింది. దావావో ఒరియెంటల్, సూరిగావో డెల్ సూర్, అగుసాన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడింది. భూకంపం అనంతరం కొద్ది గంటల్లోనే 5.2 తీవ్రతతో ఆఫ్టర్‌షాక్‌లు కూడా నమోదయ్యాయి.
అచ్చు మనిషిని పోలిన హేమాచల నరసింహుడు
ఇతర దేశాల నుంచి సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం గురించి స్పష్టమైన నివేదికలు అందకపోయినా, తీరప్రాంత గ్రామాల్లో కొంతమంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. మిండనావో దీవి భూకంప ప్రభావిత ప్రాంతంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఈసారి 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటిగా నమోదైంది. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.