సినిమా టికెట్ల ధరల పెంపుపై వస్తున్న ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. ఈ విషయంలో తన దగ్గరకు రావద్దని ఇప్పటికే సినిమా పరిశ్రమ ప్రతినిధులకు స్పష్టంగా చెప్పినట్టు వెల్లడించారు. అందుకే ఇటీవలి కాలంలో ఎవరూ తనను కలవడానికి కూడా రావడం లేదని అన్నారు.
పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన దుర్ఘటనను గుర్తు చేసిన మంత్రి, ఆ సంఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని చెప్పారు. ఆ ఘటన తర్వాతే సినిమా టికెట్ల ధరల పెంపు అంశానికి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అప్పటి నుంచే ఈ విషయంపై తనను సంప్రదించవద్దని సూచించినట్టు చెప్పారు.
ఇటీవల విడుదలైన సినిమాలకు టికెట్ల ధరలు పెరిగాయని మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ఆ పెంపుకు సంబంధించిన ఫైళ్లపై తాను ఎలాంటి సంతకం చేయలేదని స్పష్టం చేశారు. నిన్నటి సినిమాకు, రేపటి సినిమాకు టికెట్ల ధరలు ఎలా పెరిగాయో తనకు తెలియదని అన్నారు. ఈ వ్యవహారంలో ఏమి జరుగుతోందో తనకు సమాచారం లేదని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
టికెట్ల ధరల పెంపు నిర్ణయాల్లో తన ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేస్తూ, ఈ అంశంపై తన పేరును అనవసరంగా లాగవద్దని ఆయన కోరారు.