రాజస్థాన్ ఎడారుల్లో భారత సైన్యం “ఆపరేషన్ అఖండ ప్రహార్” పేరుతో ఒక విశాలమైన సైనిక విన్యాసం ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే రుద్ర బ్రిగేడ్, భైరవ బెటాలియన్, అలాగే అత్యాధునిక డ్రోన్ సపోర్టెడ్ ‘అశని యూనిట్స్’ పాల్గొన్నాయి. ఈ భవిష్యత్తులో జరిగే యుద్ధ పరిస్థితులకు సైనికులను సిద్ధం చేయడం, ఆధునిక సాంకేతికతను సమన్వయంగా వినియోగించడం ఈ ఆపరేషన్ ముఖ్యోద్దేశం.
భారత సైన్యం ఈ విన్యాసాల ద్వారా డిజిటల్ వార్ఫేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు, డ్రోన్ సర్వేలెన్స్, నైట్ కాంబాట్ సిస్టమ్స్, మరియు సైబర్ కమాండ్ సమన్వయం వంటి ఆధునిక సాంకేతిక వ్యూహాలను పరీక్షించింది. ప్రత్యేకంగా అశని యూనిట్స్‌లోని డ్రోన్లు శత్రు కదలికలను క్షణక్షణానికి గుర్తించడమే కాకుండా, టార్గెట్లను తక్షణం ధ్వంసం చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.
రుద్ర బ్రిగేడ్ యాంత్రిక యుద్ధ వ్యూహాల్లో తమ ప్రతిభను చాటగా, భైరవ బెటాలియన్ రాత్రి యుద్ధ వ్యాయామాలు, స్నైపర్ ఆపరేషన్లు, మరియు శత్రు ప్రదేశాల్లో ప్రవేశ వ్యూహాలను విజయవంతంగా అమలు చేసింది. ఈ విన్యాసాల్లో హెలికాప్టర్ దళాలు, ట్యాంక్ డివిజన్లు, మరియు గ్రౌండ్ ట్రూప్స్ సమన్వయంగా పనిచేసి సంయుక్త ఆపరేషన్ మోడల్‌ను ప్రదర్శించాయి.
సైనిక వర్గాల ప్రకారం, ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం తమ “రెడి ఫర్ మల్టీ-డొమైన్ వార్” సిద్ధతను ప్రపంచానికి చాటింది. రక్షణ శాఖ అధికారి ప్రకారం, ఇది సాధారణ విన్యాసం కాదని, ఇది భవిష్యత్తు యుద్ధాల రూపరేఖలకు పునాది వేస్తుందని అన్నారు.