•ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిది
•విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలి
•50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికల అమలులో ఉద్యాన శాఖ పాత్ర కీలకం
•అటవీ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
భూ మాతను రక్షించుకుంటూ, రైతుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలు సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతోపాటు వాతావరణాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో 50 శాతం గ్రీన్ కవర్ ప్రణాళికలపై అటవీ, ఉద్యాన శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ అంశాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చర్యల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. గ్రీన్ కవర్ పెంపులో ఉద్యాన శాఖ పాత్ర, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ “గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2047 నాటికి రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధన అంశాలను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం అన్ని ప్రభుత్వ రంగ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు వెళ్లాలి. గ్రీన్ కవర్ ఏర్పాటులో ఉద్యానవన శాఖ పాత్ర కీలకం. ఉద్యాన పంటల సాగులో వైవిధ్యం తీసుకురావడం ద్వారా అటు రైతుకీ, ఇటు భూమికీ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకే పంటలో వివిధ రకాల జాతుల మొక్కలు అంతర పంటలుగా సాగు చేసే విధంగా రైతులను పోత్సహించాలి. సింథటిక్ మందుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలి. తద్వారా భూమికి చేవ పెరుగుతుంది. జీవవైవిధ్యాన్ని రక్షించుకోవచ్చని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్, రైతు సాధికారిత సంస్థ ఎగ్జికూటివ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్, నాచురల్ ఫార్మింగ్ సొసైటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.