ఇరుసుమండ బ్లో అవుట్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదు అని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, రాజోలు ఎమ్మెల్యేకి సూచించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలో ఉన్న మోరి 5 ఓఎన్జీసీ సైట్ లో గ్యాస్ లీక్ వల్ల తలెత్తిన బ్లో అవుట్ ప్రభావం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్లో అవుట్ చోటు చేసుకున్న ప్రాంతానికి కిలో మీటరు పరిధిలో ఉన్న పాఠశాలలను ఖాళీ చేయించామని తెలుపుతూ ఇరుసుమండ ప్రాంతంలో చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ శ్రీ మహేష్ కుమార్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంసిద్ధంగా ఉన్నాయనీ, మోరి 5 ఓఎన్జీసీ సైట్ కి సమీపంలో ఉన్నవారి కోసం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి తరలిస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ తోపాటు రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ తో మాట్లాడుతూ బ్లో అవుట్ విషయమై పరిసర ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో వదంతులు, ఆందోళన కలిగించే అంశాలు ప్రచారం కాకుండా చూడాలని సూచించారు. పరిసరాల్లో ఉండే కొబ్బరి తోటలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలన్నారు. సహాయక శిబిరాల్లో ఉండేవారికి అవసరమైన ఔషధాలతోపాటు, శీతాకాలమైనందున దుప్పట్లు కూడా ఇవ్వాలని సూచించారు.