•రూ. 50 లక్షల విరాళంతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం
• తీరనున్న కొణిదెల గ్రామ దాహార్తి
•పల్లె పండగ, సాస్కీ, గ్రామీణ రహదారి సబ్ ప్లాన్ ద్వారా రూ. 6 కోట్లతో పలు అభివృద్ధి పనులు
•ఎన్నికల ముందు కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండల పరిధిలోని కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టితో ఆ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రూ. 50 లక్షల విరాళం అందించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ, గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ తదితర పథకాల ద్వారా వచ్చిన నిధులతో రోడ్లు, డ్రెయిన్లు, కాలువల అభివృద్ధి… గోకులాలు, ఇళ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పథకాల నుంచే ఇప్పటి వరకు సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులు కొణిదెల గ్రామాభివృద్ధికి వెచ్చించారు.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో ఉండగా తమ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కొణిదెల గ్రామానికి చెందిన కొందరు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు. తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఆ సందర్భంలో ఆయన హామీ ఇచ్చారు. గత ఏడాది నందికొట్కూరు నియోజకవర్గంలో ఫారం పాండ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షల విరాళం అందజేశారు. ఈ నిధులతో గ్రామానికి అవసరం ఉన్న అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు గ్రామంలో తాగునీటి సమస్యను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా యంత్రాంగం సూచన మేరకు తానిచ్చిన రూ. 50 లక్షలతో కొణిదెల గ్రామంలో 90,000 లీటర్ల రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. ఈ ట్యాంక్ కొణిదెల గ్రామం పరిధిలో 2 వేల మంది దాహార్తి తీర్చనుంది. వేసవికి ముందే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి కావడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనందం వ్యక్తం చేశారు. సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి, గ్రామీణ నీటి సరఫరా విభాగం (RWS) అధికారులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
•సుమారు రూ. 6 కోట్ల నిధులతో సర్వతోముఖాభివృద్ధి:
కొణిదెల గ్రామానికి పల్లెపండగ 1.0లో సుమారు రూ. 20 లక్షలకు పైగా నిధులు వెచ్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మూడు అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయ్యింది. పల్లెపండగ 2.0లో రూ. 45 లక్షల అంచనా వ్యయంతో ఏడు సీసీ రోడ్లు మంజూరు చేశారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధులతో కొణిదెల గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి కొణిదెల గ్రామం వరకు ఉన్న రోడ్డు పునరుద్ధరణ పనులకు రూ. 45 లక్షలు మంజూరు చేయించారు. వీటితో పాటు ఆ గ్రామ ప్రజల అభ్యర్ధన మేరకు 4 గోకులాలు, గృహ నిర్మాణశాఖ సహకారంతో 19 ఇళ్లు, నీటితొట్టెలు నిర్మించారు.
రైతుల కోసం 49 ఫీడర్ ఛానల్స్ ను జాతీయ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి చేశారు. రెండు మైనర్ కాలువల పునరుద్ధరణ, మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మత్తులు పూర్తి చేశారు. ఇచ్చిన హామీ మేరకు గ్రామస్తుల అడిగిన ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పనులు చేపడుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ