•రూ. 3.9 కోట్ల పంచాయితీరాజ్ నిధులతో రోడ్డు నిర్మాణం
•శివరాత్రిలోపు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి
•గిరిప్రదక్షణ మార్గం నమూనా లే అవుట్ పరిశీలన
•కోటప్పకొండ జింకలపార్క్ పరిశీలన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ – కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం కోట్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్థూపం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు. రూ. 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారు భక్తుల సౌకర్యార్ధం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అర్జీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాలలోపు రోడ్డు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

కోటప్పకొండ – కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు లక్షన్నర మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. కొత్తపాలెం గ్రామ పరిసరాల్లోని రైతులకు, గోనేపూడి పాఠశాలకు వెళ్లే విద్యార్ధులకు ఇబ్బందులు తొలగనున్నాయి. రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా గోనేపూడి పాఠశాల విద్యార్ధులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తమ కోసం రహదారి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గోనేపూడి జిల్లా పరిషత్ పాఠశాలకు క్రీడా మైదానంతోపాటు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, జనసేన నరసరావుపేట ఇంచార్జ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ సయ్యద్ జిలాని గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా గారు తదితరులు పాల్గొన్నారు.

•గిరిపద్రక్షణ మార్గం లే అవుట్ పరిశీలన:
త్రికోటేశ్వర స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో కొండ చుట్టూ గిరిప్రదక్షణ మార్గం నిర్మాణానికి సంబంధించి రూపొందించిన లే అవుట్ ని పరిశీలించారు. పల్నాడు రేంజ్ డీఎఫ్ఓ శ్రీమతి జి. కృష్ణప్రియ గారు అటవీ మార్గంలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని చూపించారు. అటవీశాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతుల ప్రక్రియను వివరించారు. కోటప్పకొండ గిరిప్రదక్షణకు వచ్చే భక్తుల సంఖ్య రాను రాను పెరుగుతున్న నేపధ్యంలో త్వరితగతిన గిరిప్రదక్షణ మార్గం నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశించారు.
•వనవిహారి పార్క్ సందర్శన:
అనంతరం కోటప్పకొండ ఘాట్ రోడ్డులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనవిహారి జింకల పార్కును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. పార్కులోనికి వెళ్లి జింకలకు స్వయంగా ఆహారం అందించారు. ఈ జింకల పార్కులో మచ్చల జింకలు ఉన్నాయని, జింకల సంరక్షణకు, వాటికి ఇబ్బందులు కలగకుండా పర్యాటకుల సందర్శనకు ఏర్పాట్లు చేసినట్టు అటవీశాఖ అధికారులు ఆయనకు వివరించారు. వనవిహారి పార్కుకు అనుసంధానంగా ఉన్న అటవీ భూబాగాన్ని పార్కులో ఉన్న వివిధ రకాల పక్షి జాతుల వివరాలు తెలియజేశారు. పార్కులో ఉన్న వృక్ష జాతుల వివరాలు, వాటి వల్ల కలిగే ఉపయోగాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పార్క్ సందర్శన నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రైన్ ను పరిశీలించి, దాని నిర్వహణ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.