•శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు
•పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
•శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించిన సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్
రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన శ్రీపవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు.

ఆయనకు గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురు ద్వారా ప్రముఖుల చేతుల మీదుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంప్రదాయ సిక్కు తలపాగాను ధరించారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఫడ్నవిస్ గారితో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ ఫడ్నవిస్ గారికి వేసి ఆశీర్వదించారు.
అనంతరం సమాధి మందిరం లోపల భాగంలో ప్రదక్షిణ ముగించుకుని వెలుపలికి వచ్చారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు.
దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు.

•శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన సత్కారం:
అంతకు ముందు మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఛైర్మన్ ఆధ్వర్యంలో సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ ను బహూకరించారు.
•శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ స్ఫూర్తిని త్యాగం స్ఫూర్తిదాయకం:
గురుద్వారా సందర్శన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.