బుధవారం పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామానికి చెందిన శ్రీ చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని పరామర్శించారు. గత ఏడాది జులైలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీ వసంతరాయలుకి బ్రెయిన్ డెడ్ కాగా, అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు బుధవారం పెదచందాలలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భార్య శ్రీమతి నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిలను ప్రమాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. వారు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. తండ్రి మరణానంతరం ఉద్యోగం వదిలి కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్న సీతారామరాజుని అభినందించారు. కుమార్తె జాహ్నవికి వినికిడి లోపం, మాటలు రావని తెలిసుకుని టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా సాయం చేయాలని అధికారులకు సూచించారు. సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీం కింద ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలన్నారు. మీ కష్టంలో మేము తోడుంటామంటూ భరోసా ఇచ్చారు.
పర్యటన సందర్భంగా దారిపొడవునా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.