సోమవారం ఉదయం మేడారంలో పునర్నిర్మించిన సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ముఖ్యమంత్రి గారు పూజలు నిర్వహించి మహా జాతరను ప్రారంభించారు.
ఉదయం 8 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుని, ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముఖ్యమంత్రి గారు దావోస్‌కు బయలుదేరారు.
జనవరి 20 నుంచి నాలుగు రోజుల పాటు దావోస్‌లో జరిగే సదస్సులో ముఖ్యమంత్రి గారు ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి భేటీలు నిర్వహించనున్నారు.
దావోస్‌లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి గారు విడివిడిగా భేటీ అవుతారు. అలాగే పలు రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.
తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాల్లో పెట్టుబడులపై ప్రధానంగా చర్చలు జరుపుతారు.
“#TelanganaRising2047” విజన్‌ను, రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధికి ఉన్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ పర్యటన ద్వారా తెలంగాణను ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.