పుష్కర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది పశువుల మేళ. ఈ పశుమేళాలో ఆకర్షణీయమైన ఎద్దులు, దున్నలు, ఆవులు, గేదెలు, ఒంటెలు, గుర్రాలు వంటి మేలిమి జాతికి చెందిన వాటిని తీసుకొచ్చి వాటి ప్రత్యేకతలు తెలియజేస్తూ అమ్ముతుంటారు. ఈ మేళలో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. విలువైన, మేలిమి జాతికి చెందిన పశువులు కూడా అమ్మకం జరుగుతుంది. అయితే, ఈసారి ఈ మేళలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం షాహ్‌బాజ్ అనే గుర్రం. ఈ గుర్రం ఖరీదు అక్షరాల 15 కోట్లు. ఏంటీ 15 కోట్లా అని నోరెళ్లబెట్టకండి… పదిహేను కోట్లే. ఖరీదుకు తగినవిధంగానే ఈ గుర్రంలో స్పెషల్ ఫీచర్స్ అనేకం ఉన్నాయని అంటున్నాడు దాని యజమాని గ్యారీ గిల్. చత్తీస్‌గడ్ నుంచి ప్రత్యేకంగా ఈ ప్రదర్శనకు తీసుకొచ్చారు.
ఈ గుర్రం వయసు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులోనే ఈ గుర్రం పలురకాలైన పోటీల్లో విజేతగా నిలిచింది. ఇది అరుదైన రాజవంశానికి చెందిన బ్రీడ్‌గా చెప్పుకొచ్చాడు గ్యారీ గిల్. ఈ గుర్రం శరీర ఆకృతి, శక్తివంతమైన శరీర నిర్మాణం గుణం కలిగిన ఈ గుర్రం అత్యంత స్పెషల్‌గా నిలిచింది. ఈ గుర్రం ఒకసారి బ్రీడింగ్‌కు వెళ్తే ఫీజు కింద రూ. 2 లక్షలు వసూలు చేస్తారట. ఇప్పటి వరకు సుమారు 9 కోట్ల రూపాయల మేర ఈ గుర్రం సంపాదించినట్టు తెలియజేశాడు. ఈ కారణంగానే ఈ గుర్రాన్ని 15 కోట్లకు అమ్మకానికి పెట్టినట్టు తెలియజేశాడు. ఈ గుర్రం నుంచి కొన్ని వందల అరుదైన గుర్రాల పుట్టుక కూడా జరుగుతుందని అంటున్నాడు.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ గుర్రాన్ని వీడియోలు తీసుకునేందుకు, వాటితో ఫొటోలు దిగేందుకు పోటీ ఎక్కువగా ఉండటంతో ఈ గుర్రానికి వీఐపీ సెక్యూరిటీ కల్పించారు. దేశీయ వ్యాపారస్తుల నుంచి విదేశీ వ్యాపారులు కూడా ఈ గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి ఎవరికి ఆ అదృష్టం వరిస్తుందో చూడాలి.