విజయదశమి రోజైన అక్టోబర్ 2న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నాగపూర్‌లోని రెషింబాగ్ మైదానంలో వందేళ్ల మహాసభను నిర్వహించారు. ఈ సభకు 21 వేల మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్నారు. ఈ సభ వందేళ్ల ఘనతకు చిహ్నంగా, శ్రద్ధ, క్రమశిక్షణకు అనుగుణంగా జరిగింది. ఈ సభకు ముందు స్వయంసేవకులు క్రమబద్ధమైన శిక్షణతో కూడిన మార్చ్‌ను నిర్వహించారు. ఇది సంఘ్ క్రమశిక్షణకు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ఇక ఈ మార్చ్ తరువాత సంఘ్ ప్రార్థనలు చేశారు.
అనంతరం ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ కీలక ప్రసంగం చేశారు. తన ప్రసంగం యావత్తు ఆత్మనిర్భరత, ఏకత్వం, సమాజంలో జరగవలసిన ఐదు మార్పులను గురించి ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ జాగరణ, సామాజిక సమరత, పర్యావరణ రక్షణ, గ్రామాభివృద్ధి, వ్యక్తిగత ధర్మపాలన తదితర అంశాలను జోడించారు. ఇక మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన, ఇప్పటికీ అందిస్తున్న సేవలు, సమానత్వం కోపం పాటుపడుతున్న విధానం, సమగ్రత వంటివాటిని ప్రస్తావించారు. ఇక ప్రధాని మోడీ 1947 నుంచి 2020 వరకు ఆర్ఎస్ఎస్ అందించిన సహాయక సేవలను వివరించారు. ఈ సభ యావత్తు 100 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని గుర్తుచేసే ఘట్టంగా నిలిచింది. సంఘ్ కేవలం ఒక సంస్థ కాకుండా, శక్తి, సేవ, సమాజ నిర్మాణానికి అంకితం అయిన ఉద్యమం అని ఈ సభ స్పష్టంగా చూపించింది. ఈ సభ ముక్తకంఠంతో ఏక్ భారత్…శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని సంకల్పాన్ని బలంగా చాటింది.