తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర ఆలయం మరోసారి అంతర్జాతీయ భక్తులతో కళకళలాడింది. రాహు–కేతు క్షేత్రంగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి రష్యాకు చెందిన దాదాపు 40 మంది భక్తులు ప్రత్యేకంగా శ్రీకాళహస్తికి తరలివచ్చారు. విశేషంగా ఈ విదేశీ భక్తులు సంప్రదాయ కట్టు–బొట్టుతో ఆలయానికి రావడం స్థానిక భక్తులను ఆకట్టుకుంది.
రష్యన్ భక్తుల్లో 29 మంది మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉండగా, వారు ఆలయంలో రెండు గంటలకు పైగా గడిపి రాహు–కేతు పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఆలయ గోపురాలు, స్తంభాలు, శిల్పాలు చూసి వారు మంత్రముగ్ధులయ్యారు. ఆలయంలో కొలువైన స్వామి–అమ్మవార్ల విశిష్టత, ఆలయ ప్రాశస్త్యాన్ని అర్చకులను అడిగి వివరంగా తెలుసుకున్నారు.
పూజల అనంతరం స్వామి అమ్మవార్లపై తమ భక్తి, విశ్వాసం మరింత పెరిగిందని రష్యన్ భక్తులు ఆనందంగా వెల్లడించారు. ఆలయ ధ్వజస్తంభం ముందు అర్చకులతో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఈ అనుభూతిని జ్ఞాపకంగా నిలుపుకున్నారు. విదేశీయులు చూపిన భక్తిశ్రద్ధను చూసి స్థానిక భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దర్శనం అనంతరం గురుదక్షిణామూర్తి ఆలయం వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందిన రష్యన్ భక్తులకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సంఘటన శ్రీకాళహస్తి ఆలయానికి ఉన్న విశ్వవ్యాప్త ఆకర్షణను మరోసారి చాటిచెప్పింది.