ప్రపంచంలో ఏ దేశంలోను లేనటువంటి స్వేచ్ఛా వాతావరణం నేడు భారతదేశంలో ఉందంటే ప్రధాన కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ అక్టోబరు 31న అన్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన యూనిటీ రన్ కార్యక్రమంలో రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ – భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశ నిర్మాణం, సమగ్రత, సమైక్యత, అంతర్గత భద్రతకు ఎంతోపాటుపడి ఎన్నో విషయాల్లో కఠినమైన నిర్ణయాలతో సమగ్ర భారతావనిని నిర్మించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అన్నారు. ఆ మహా నాయకుడి 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన గొప్పతనాన్ని యువతకు, భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈరోజు పోలీస్ ప్రాంగణం నుండి బాలాజీ కూడలి వరకు సమైక్యతా ర్యాలీను నిర్వహిస్తున్నామన్నారు.
ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు మాట్లాడుతూ – భారతదేశ పౌరుడిగా గర్వంగా చెప్పుకొంటున్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ధృడ సంకల్పంతో ఆయన తీసుకున్న నిర్ణయాలు కారణంగా ప్రజల్లో ఆయన సర్దార్, ఉక్కుమనిషిగా నిలిచారన్నారు.

విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి రాజు మాట్లాడుతూ – జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్,
జునాఘడ్ సంస్థానాలను తన రాజనీతితో చాకచక్యంగా భారతావనిలో విలీనం చేసిన మహనీయుడని అన్నారు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా భారత దేశం మొత్తం ఒకే పరిపాలనా వ్యవస్థ ఉండాలని సంకల్పించి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ ను రూపకల్పన చేసి గొప్ప వ్యక్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని తెలిపారు.

అనంతరం, ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువత,ఎన్. ఎస్. ఎస్, ఎన్. సీ. సీ స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు దేశ ఐక్యత, సమగ్రతకు, అంతర్గత భద్రతకు కట్టుబడి ఉంటామని, సమైఖ్యతతో మెలిగి, భారత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతామని ప్రతిజ్ఞ చేసారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా యువత, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థలు మత్తు, మాదక ద్రవ్యాలకు దూరం ఉంటామని, డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా విజయనగరంను తీర్చిదిద్దుతామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రతిజ్ఞ చేసారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొదించేందుకు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్వానితులను ఆకట్టుకున్నాయి. యూనిటీ మార్చ్ సెల్ఫీ పాయింట్ లో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ ఫోటోలు దిగారు. పోలీస్ శిక్షణా కళాశాల ప్రాంగణం లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి మనంగా నివాళులు అర్పించారు. అనంతరం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి, సమైక్యతా ర్యాలీని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పీటీసీ ప్రిన్సిపాల్ రామచంద్రరాజు, కూటమి నేతలు రాజేష్ వర్మ, పాలవలస యశస్వి, అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, ఈ.కోటిరెడ్డి, పలువురు సిఐలు, ఆర్బలు, ఇతర పోలీసు అధికారులు, మై భారత్ జిల్లా యువజన సమన్వయ కర్త ప్రేమ్ భరత్ కుమార్, రెడ్ క్రాస్ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, పెద్ద సంఖ్యలో పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.